వైసీపీలో సీమ టెన్షన్

 

కర్నూలు, ఫిబ్రవరి 14, (globelmedianews.com
రాయలసీమ ప్రభావం ఉన్న ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలు సీమ టపాకాయల్లా పేలుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే కుదరదని, తాము పనిచేయబోమని వైసీపీ అధినేత జగన్ కు తేల్చి చెబుతున్నారు. సులువుగా వచ్చే సీటును వర్గ విభేదాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంటుందా? జగన్ అందరి నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి మరోసారి ఈ సీటులో ఫ్యాన్న పార్టీ జెండాను ఎగుర వేయగలరా? అన్నదే ప్రశ్న. వైసీపీలో తలెత్తిన విభేదాలను గమనిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు.


 వైసీపీలో సీమ టెన్షన్

ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ గిద్దలూరు నియోజకవర్గం లో సీమ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. 1967 వరకూ ఈ ప్రాంతం కర్నూలు జిల్లాలోనే ఉండేది. రాయలసీమ ప్రాంతంతో బంధుత్వాలు మాత్రమే కాకుండా ఇక్కడ యాస, తిండి వగైరాలన్నీ సీమ ప్రాంతాన్ని తలపిస్తాయి. గత ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. తొలినుంచి కాంగ్రెస్ కు పట్టున్న ఈ నియోజకవర్గంలో ఆ ఓటు బ్యాంకును వైసీపీ దక్కించుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయ్యారు. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్థిని జగన్ పార్టీ నిలబెట్టాల్సి ఉంది.గిద్దలూరు నియోజకవర్గంలో యాదవ సామజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఆ తర్వాత బలిజ, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఉంటారు. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండాలాల్లో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. అందుకే పార్టీల కతీతంగా ఇక్కడ పిడతల ఫ్యామిలీ గెలుస్తూ వస్తుంది. అయితే ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ రెడ్డి పార్టీని వీడటంతో ఆయన స్థానంలో ఐవీ రెడ్డిని వైసీపీ అధిష్టానం ఇన్ ఛార్జిగా నియమించింది. ఇక గిద్దలూరు వైసీపీలో పిడతల సాయికల్పనా రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఐవీ రెడ్డి, సాయికల్పనలో ఎవరో ఒకరికి టిక్కెట్ దక్కుతుందని నిన్న మొన్నటి వరకూ అనుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరడంతో సమస్య వచ్చి పడింది. అన్నా రాంబాబు వైసీపీలో చేరిన తర్వాత టీడీపీలో ఉన్న ముఖ్య నేతలను వైసీపీలోకి తీసుకొచ్చారు. కొంత దూకుడుగా వెళుతున్నారు. అన్నా రాంబాబుకు టిక్కెట్ దక్కుతుందన్న ప్రచారంతో ఐవీరెడ్డి, సాయికల్పనారెడ్డిలు వైసీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అన్నా రాంబాబుకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని వారు తెగేసి చెప్పడంతో వైసీపీ అధిష్టానం కూడా గిద్దలూరు టిక్కెట్ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

No comments:
Write comments