ఇంకా అందని ఆరోగ్య కిట్స్

 

హైద్రాబాద్, ఫిబ్రవరి 11, (globelmedianews.com)
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, విద్యార్థుల సంక్షేమంపైనా దృష్టి సారించింది. విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తునే వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక కిట్లను ఉచితంగా అందజేస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం కొరత ఏర్పడింది. ఈ విద్యాసంవత్సరంలో రెండు దఫాలుగా పంపిణీ చేయగా, మూడో విడత మరింత ఆలస్యమవుతోంది.దీంతో విద్యార్థినులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు గతేడాది నుంచే ఈ తరహా కిట్లను అందజేస్తున్నారు. 


 ఇంకా అందని ఆరోగ్య కిట్స్ 

ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థినులకు ఆరోగ్య కిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇక్కడ చదువుకునేవారు ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతోపాటు దాదాపు అందరూ పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. వారికి ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడంతోపాటు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరోగ్య పరిరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్య కిట్లు అందజేయాలని నిర్ణయించింది.ఆయా మండలాల పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న నిర్దేశిత వయస్సున్న విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా కిట్లు సరఫరా చేస్తున్నారు. ఒక్కో కిట్‌లో 11 రకాల వస్తువులు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 15 కస్తూర్బా విద్యాలయాలు, ఏడు ఆదర్శ, 143 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో జులైలో కిట్ల పంపిణీ ప్రక్రియ మొదలైంది.ప్రతి మూడు నెలలకోసారి కిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించగా మొదట జులైలో, తర్వాత నవంబరులో విద్యార్థినులకు అందజేశారు. తొలి రెండు విడతల్లోనూ కిట్ల కొరత ఏర్పడింది. ఇక ఈ ఏడాదిలో మూడో విడత కిట్లను పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ విద్యార్థినులకు అందలేదు. మరో రెండున్నర నెలలు గడిస్తే విద్యా సంవత్సరం పూర్తికానుంది. అధికారులు చర్యలు తీసుకుని విద్యార్థినులు అందరికి కిట్లు అందజేయాలి.

No comments:
Write comments