సెల్ టవర్ల లెక్కలు తీస్తున్నారు...

 

.హైద్రాబాద్, ఫిబ్రవరి 12, (globelmedianews.com)
జిహెచ్‌ఎంసి పరిధిలో ఎన్ని సెల్ టవర్లున్నాయి. వాటి నుంచి అసలు ఆస్తిపన్ను వసూలును వర్తింపజేయాలా? లేదా? అన్నది నేటికీ అయోమయంగానే తయారైంది. అసలు సెల్ టవర్లపై జిహెచ్‌ఎంసి వద్ద స్పష్టమైన సమాచారమంటూ లేకపోవటంతో వాటి నుంచి ఏటా వచ్చే ఆస్తిపన్ను ఖజానాకు చేరటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాలను పరిశీలించే టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల వద్ద నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతమున్న సెల్ టవర్ల సమాచారం ఉన్నా, అవి ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ గుర్తించిన సెల్ టవర్ల సంఖ్య 884 మాత్రమే ఉండగా, గతంలో రెవెన్యూ విభాగం గుర్తించిన సెల్ టవర్లు 13 కంపెనీలకు చెందిన సుమారు 5వేల 438 వరకున్నట్లు సమాచారం. 


 సెల్ టవర్ల లెక్కలు తీస్తున్నారు...

ఇదిలా ఉండగా, ఈ రెండు విభాగాలు సర్కిళ్ల స్థాయికి పంపిన సమాచారంపై అక్కడి అధికారులు క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించామని చెబుతున్నా, నేటికీ ఏ సర్కిల్‌లో ఎన్ని, మొత్తం నగరంలో సెల్ టవర్లు ఎన్ని ఉన్నాయో కూడా తేల్చలేకపోయారు. అయితే క్షేత్ర స్థాయిలో అసలు సెల్ టవర్లు ఎన్ని ఉన్నాయి. అవి ఏఏ కంపెనీలకు చెందినవో గుర్తించేందుకు కమిషనర్ జనార్దన్ రెడ్డి రెండు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశారు. అయితే వీటిలో రిలయెన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లకు చెందిన సెల్ టవర్లు మాత్రమే ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్లు సమాచారం. మిగిలిన సెల్ టవర్లలో ఏ టవర్ ఏ కంపెనీకి చెందినదో కూడా జిహెచ్‌ఎంసి వద్ద స్పష్టమైన సమాచారం లేదు. దీనికి తోడు నగరంలో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి రిలయన్స్ ఎక్కడబడితే అక్కడ టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు ఎలాంటి ఆంక్షల్లేకుండా అనుమతులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో ఏర్పాటు చేయనున్న సెల్ టవర్, ప్రాంతాల వివరాలతో తొలుత రూ. లక్ష ఛార్జీలుగా చెల్లిస్తూ ఆ సంస్థ టవర్లను ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈ ఆఫీసు, పారిశుద్ద్యం, వేలాది మంది పారిశుద్ద్య కార్మికులకు జీతాలు చెల్లించటంలో దేశంలోమే అగ్ర స్థానంలో ఉన్న జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న సెల్ టవర్ల వివరాలు లేకపోవటంపై పలు రాజకీయ పార్టీలు కూడా అనేక రకాల ఆరోపణలు చేస్తున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు కమిషనర్  టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు వేర్వేరుగా సెల్ టవర్లను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ రెండు విభాగాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, కంపెనీల వారీగా సెల్‌టవర్ల సంఖ్యను తేల్చనున్నారు..

No comments:
Write comments