మద్యం అమ్మకాలు

 

నల్గొండ ఫస్ట్ ప్లేస్...ఖమ్మం లాస్ట్ ప్లేస్
ఖమ్మం, ఫిబ్రవరి 9, (globelmedianews.com)
 గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా మద్యం విక్రయాలు మాత్రం జిల్లా అథమ స్థానంలోనే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయనుకుంటే పొరపాటు జరిగినట్లే. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 50నుంచి 80శాతం అధికంగా విక్రయాలు జరగ్గా సాధారణంగా జరిగే దానికంటే గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో 24.5శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9.1శాతం మాత్రమే విక్రయాలు అధికంగా జరిగాయి. సాధారణ ఎన్నికల వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం జోరు కొనసాగుతుందని ప్రచారం జరిగినా అది ఇతర జిల్లాలతో పోలిస్తే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.


మద్యం అమ్మకాలు 

రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా మద్యం విక్రయాల్లో అగ్రస్థానంలో నిలవగా చిట్టచివరి స్థానంలో ఖమ్మం జిల్లా నిలిచింది. జనవరి నెలలో ఖమ్మం జిల్లాలో 67కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగ్గా కొత్తగూడెం జిల్లాలో 48కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 2018వ సంవత్సరం జనవరి నెలలో జరిగిన విక్రయాల కంటే 2019జనవరి నెలలో జరిగిన విక్రయాల్లో పెరుగుదల కన్పించినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు ధీటుగా మాత్రం ఇక్కడ విక్రయాలు జరగలేదు. ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం స్టేషన్-1 పరిధిలో 35.8శాతం, వైరా స్టేషన్ పరిధిలో 20.4శాతం, సత్తుపల్లి స్టేషన్ పరిధిలో 26.9శాతం, కారేపల్లి పరిధిలో 7.7శాతం, నేలకొండపల్లి పరిధిలో 13.8శాతం, ఖమ్మం స్టేషన్-2 పరిధిలో 28.1శాతం, మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18.8శాతం విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది కంటే విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా జనవరి నెలలో గత సంవత్సరాల కంటే అధికంగానే మద్యం విక్రయాలు జరిగినప్పటికీ పంచాయతీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో 40శాతానికి పైగా అధికంగా విక్రయాలు జరగ్గా ఖమ్మం జిల్లాలో మాత్రం అది 25శాతం లోపే ఉండటం గమనార్హం. అయితే మద్యం విక్రయాల్లో నిబంధనలను కఠినంగా పాటించినందు వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఓ ఎక్సైజ్ అధికారి వెల్లడించగా ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు ఇతర జిల్లాల నుంచి కూడా మద్యం సరఫరా అయినట్లు మరో అధికారి చెప్పారు. మొత్తంమీద పంచాయతీ ఎన్నికల సమయంలో మద్యం విక్రయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా చివరి స్థానంలో ఉండటం విశేషం

No comments:
Write comments