దేవాదాయ శాఖలో ముందుకు సాగని పదోన్నతులు

 

విజయవాడ, ఫిబ్రవరి 5, (globelmedianews.com)
దేవాదాయ శాఖలో జిల్లాల్లో మఫిసిల్ సూపరింటెండెంట్లకు పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. కార్యనిర్వహణాధికారులు (ఈవోలు), ప్రధాన కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్లు పదేళ్లలోనే పదోన్నతులతో అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) స్థాయికి చేరుకుంటుండగా, మూడు దశాబ్దాలు దాటినా ఆ స్థాయిని చేరుకోలేక మఫిసిల్ సూపరింటెండెంట్లు మగ్గిపోతున్నారు. దేవాదాయ శాఖలో ఏటా డీపీసీలో సమీక్షించుకుని నిష్పత్తుల ప్రకారం ఏసీల నియామకం చేయాల్సివుంది. డీపీసీ సమీక్ష ద్వారా ప్రతీ ఏడాది ప్యానెల్ పదోన్నతుల కోసం జాబితాను రూపొందించాలి. అసిస్టెంట్ కమిషనర్లుగా ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా ఎంపికయ్యే వారితోపాటు గ్రేడ్-1 ఈవోలు, మఫిసిల్ సూపరింటెండెంట్లు, హెడ్ ఆఫీసు సూపరిండెంట్లకు డీపీసీ జాబితా ప్రకారం అవకాశం కల్పించాలి.దేవాదాయ శాఖ ఆవిర్భావం నుంచి ఉన్న నిబంధనల జీవోలను తుంగలోతొక్కి తీసుకొస్తున్న కొత్తకొత్త ఉత్తర్వుల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. 


దేవాదాయ శాఖలో  ముందుకు సాగని పదోన్నతులు

తాజాగా జారీ అయిన జీవో 590తో మఫిసిల్ సూపరింటెండెంట్లను పక్కనపెట్టి ఇతరులందరికీ పదోన్నతులు కల్పించిన వైనం దేవాదాయ శాఖలో కలకలం సృష్టిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై కొంతమంది మఫిసిల్ సూపరింటెండెంట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు.
 గ్రేడ్ 3 ఈవోల నుంచి గ్రేడ్-2 ఈవోగా ఇలా ప్రతి రెండేళ్లకోసారి పదోన్నతి పొందుతూ గ్రేడ్-1 ఈవోగా పదోన్నతుల పొంది, సుమారు ఎనిమిదేళ్ల కాలపరిమితిలో ఏసీగా పదోన్నతి పొందడానికి అర్హత సాధిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్‌గా ఏపీపీఎస్సీ ద్వారా నియమితులయ్యే వారు పదోన్నతిపై సీనియర్ ఆసిస్టెంట్‌గా ఆపై మఫిసిల్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందుతారు. ఇలా చేరడానికి వారికి పదేళ్లకు పైగా సమయం పడుతుంది. వీరితోపాటు దేవాదాయశాఖ కమిషనరేట్‌లో పనిచేసే సూపరింటెండెంట్లు, పెద్ద ఆలయాల్లో పీఏ టు ఈవోలు కూడా ఏసీలుగా పదోన్నతికి అర్హులు. పదోన్నతులకు వీరంతా అర్హులైనప్పటికీ, ఇప్పటివరకు హెడ్డ్ఫాసులో పనిచేసే సూపరిండెంట్లకు మాత్రమే ఏసీలుగా పదోన్నతులు లభిస్తుండగా, జిల్లాల్లో పనిచేసే మఫిసిల్ సూపరింటెండెంట్లకు మొండిచేయి ఎదురవుతోంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మఫిసిల్ సూపరింటెండెంట్లు కోర్టును ఆశ్రయించి ఏసీలుగా పదోన్నతులు పొందారు.
సాధారణంగా 245 జీవో ప్రకారం వీరికి పదోన్నతులు ఇవ్వాల్సివుంది. ఈ జీవో ప్రకార, మఫిసిల్ సూపరింటెండెంట్లకు 3, పీ ఏ టు ఈవోల నుంచి ఒకటి, గ్రేడ్-1 ఈవోల నుంచి ఒకటి, పబ్లిక్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ నుంచి ఒక పోస్టును భర్తీచేయాల్సివుంది. ప్రస్తుతం ఈ విధానాలన్నీ పక్కనబెట్టేసి ఈవోలకు ఏసీలుగా అడహక్ పదోన్నతులు కల్పిస్తున్నారు. మఫిసిల్ సూపరిండెంట్లకు నిబంధనల ప్రకారం పదోన్నతులు ఇస్తే అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు చేరుకుంటారు.
గ్రేడ్-1 ఈవోలకు పదోన్నతులు కల్పించిన తర్వాతే మఫిసిల్ సూపరింటెండెంట్లకు ఇవ్వాలని కొందరు తమ పలుకుబడి ఉపయోగించడంతో వారికి పదోన్నతులు నిలిచిపోయాయని తెలుస్తోంది. అయితే తదనంతరం వచ్చిన 337 జీవో ప్రకారం 8:2 నిష్పత్తిలో మఫిసిల్ సూపరింటెండెంట్లకు పదోన్నతులు ఇవ్వాల్సివుంది. అంటే ఎనిమిది పోస్టులు పీఏ టు ఈవోలు, గ్రేడ్-1 ఈవోలు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లకు ఇచ్చి మిగిలిన 2 పోస్టులు మఫిసిల్ సూపరింటెండెంట్లకు ఇవ్వాల్సివుంది. దీనిపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 337 ప్రకారం ఏడు పోస్టులను సైకిల్ సర్కిల్‌గా నిర్ణయించి, 4:3 నిష్పత్తిలో నియామకాలు చేయాలని నిర్ణయించారు. అంటే నాలుగు పోస్టులు ఇతరులందరికీ వస్తే, మూడు మఫిసిల్ సూపరింటెండెంట్లకు వస్తాయి. ఇపుడు ఈ సైకిల్ సర్కిల్‌ను 10 పోస్టులకు పెంచి 8:2 నిష్పత్తిలో నియామకాలకు ప్రయత్నించారు. ఇదిలావుండగా తాజాగా గత ఏడాది నవంబర్ 19న 590 జీవో జారీచేసి, 10 పోస్టులను సైకిల్‌గా రూపొందించి అందులో మఫిసిల్‌కు కేవలం ఒక పోస్టు కేటాయించి మిగిలిన 9 పోస్టుల్లో గ్రేడ్-1 ఈవోలకు 6 పోస్టులు, పీఏ టు ఈవోలకు 1, డైరెక్టు రిక్రూటీలకు 2 పోస్టులు కేటాయించేలా ఆదేశాలు జారీచేశారు. నియామకాలు కూడా గుట్టుచప్పుడు కాకుండా చేసేశారు.2008 నుంచి ప్యానల్ ఇయర్ కదపకుండా కొత్త జీవోలు సృష్టించి అన్ని పోస్టులూ కేవలం నాలుగు కేడర్లకు కట్టబెట్టడంవల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆందోళన మఫిసిల్ సూపరింటెండెంట్లలో వ్యక్తమవుతోంది. దీనికి తోడు గ్రేడ్-1 ఈవోలు పెరిగినంతగా మఫిసిల్ కేడర్ స్ట్రెంగ్త్ పెరగలేదు. దీనికితోడు ఏసీ పోస్టులు కూడా పెరగలేదు. ఈ పలుకుబడి పదోన్నతుల వల్ల మఫిసిల్ సూపరింటెండెంట్లు ఆ పోస్టులోనే రిటైరయ్యే పరిస్థితి దాపురించింది. ఏదేమైనప్పటికీ జీవో 590 తమను భూస్థాపితం చేసిందని మఫిసిల్ సూపరింటెండెంట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
దీనికి తోడు శాఖలో ఎవరికి పదోన్నతులు ఇవ్వకపోయినా రెండేళ్లకొకసారి ఈవోలు మాత్రం పదోన్నతులు పొందుతున్నారు. మినిస్టీరియల్ సిబ్బందికి మూడు దశాబ్ధాల సీనియారిటీతో ఆఫీసులకే పరిమితమవుతుండగా, కేవలం పదేళ్ల సర్వీసుతోనే ఈవోలు అసిస్టెంట్ కమిషనర్ కేడర్‌లోకి వస్తున్నారు.

No comments:
Write comments