20 ఏళ్ల నుంచి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీల కోసం ఎదురు చూపు

 

వికారాబాద్, మార్చి 6, (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లాలో రెండు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు మోక్షం లభించడం లేదు. వికారాబాద్, పాత తాండూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు దాదాపు లైన్‌క్లియర్ అవుతుందని భావించారు. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల ఫైలు రైల్వేశాఖ వద్ద ముందుకు కదలడం లేదని సమాచారం. ఈ రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు రూ.210 కోట్లు వెచ్చిస్తామని గతేడాది రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నుంచి 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇప్పించాలని కేంద్రం సూచించింది. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లైవర్ ఓవర్లు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా ఔరంగాబాద్, మన్మాడ్, షిరిడీ, బీదర్, జహీరాబాద్ వైపు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఫ్లైఓవర్ లేక వికారాబాద్ నుంచి తాండూరు రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. తరచూ రైల్వేగేటు పడటంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. పలుమార్లు స్థానికులు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. చివరకు కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్‌రెడ్డి హయాంతో కాస్త స్పందన లభించింది.


20 ఏళ్ల నుంచి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీల కోసం ఎదురు చూపు

2009 ఎన్నికల ప్రచారంలో ఫ్లైఓవర్లు తెస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్, పాత తాండూరు ప్రాంతంలో రెండు ఫ్లైఓవర్‌లకు ప్రతిపాదనలు పంపించారు. అప్పట్లో యుపిఎ సర్కార్ బడ్జెట్‌లో పొందుపర్చలేదు. రెండు, మూడు బడ్జెట్‌లలో ప్రజలు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలంటే భారీగా వ్యయం అవుతుంది. నిర్మాణ సమయంలో ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం, భూసేకరణకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పాత తాండూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీ నిర్మిస్తే భారీగా ఆస్తులు కోల్పోనున్నారు. రెండేళ్ల క్రితం తాండూరులో శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఫైలు ముందుకు కదలక ఇంకా ఎలాంటి పనులు ప్రారంభించలేదు. హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, ముంబాయి, బెంగుళూరు, తిరుపతి, ఢిల్లీ, రాజ్‌కోట్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే రైలుమార్గం తాండూరు మీదుగా ఉంది. బస్‌స్టేషన్ పరిసరాలలో 16 ఏళ్ల క్రితమే ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జీ నిర్మించారు. అది మహబూబ్‌నగర్, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు సౌకర్యవంతంగా మారింది. ప్రస్తుతం పాత తాండూరు వైపు కూడా రైల్వే క్రాసింగ్ ఉంది.పెద్ద రైలు మార్గం అయినందున ప్రతి 10 నిముషాలకు ఒకసారి గేటు వేస్తారు. వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. 2009లో రూ.25 కోట్లతో పాత తాండూరుకు ఫ్లై ఓవర్ నిర్మిస్తామని  జైపాల్‌రెడ్డి హామీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డి పాత తాండూరు రైల్వే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ.51 కోట్ల అంచనా ప్రతిపాదనలు రూపొందించారు. 2016లో రాష్ట్రంలోని పలు ఆర్‌ఓబి, ఆర్‌యుబిల నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంటు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో పాత తాండూరుకు రూ.51 కోట్లకు సంసిద్ధత తెలిపింది. అప్పట్లో ఖాజీపేట వద్ద అండర్ బ్రిడ్జీ, జహీరాబాద్, ఆదిలాబాద్, మన్యంకొండ, పెద్దపల్లి వద్ద కూడా బ్రిడ్జీలకు మోక్షం లభించింది. అనివార్య కారణాల వల్ల కేంద్రం నుంచి వాటా లభించక పనులు చేపట్టలేకపోయారు. ప్రస్తుతం వాటి నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. పాత తాండూరులో ఫ్లై ఓవర్ నిర్మించాలంటే స్థానికులు భారీగా ఆస్తులు కోల్పోనున్నారు. వారికి పునరావసం, నష్టపరిహారం కల్పించి ఫ్లై ఓవర్ నిర్మించాలంటే రూ.110 కోట్ల అవసరం అవుతాయని అంచనా. అందులో సగం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వికారాబాద్, తాండూరులో రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు నిధులు మంజూరు కావాల్సి ఉంది.

No comments:
Write comments