కాంగ్రెస్ కు సీనియర్లే శత్రువులు

 

న్యూఢిల్లీ, మార్చి 8, (globelmedianews.com)
కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరు. ఆ పార్టీలోనే సమయానికి రెడీ ఉంటారు. పార్టీ పుంజుకుంటున్న వేళ వెనక్కు లాగే ప్రయత్నాలు చేయడం వారి నైజం. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పెద్దలుగా చెప్పుకుంటున్న వీరు పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు హస్తం పార్టీలో చక్రం తిప్పిన నేతలే పార్టీని డ్యామేజ్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టలో క్రమశిక్షణ లేకపోవడం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండటం వల్లనే ఇలాంటివి ఎన్నికల సమయంలో ఎక్కువగా విన్పిస్తుంటాయి.గుజరాత్ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోరాడుతున్న సమయంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు గుజరాత్ లో ఆపార్టీని అధికారానికి దూరం చేశాయని చెప్పక తప్పదు. మోదీని సొంత గడ్డపై దెబ్బకొట్టే ఛాన్సును కాంగ్రెస్ చేజార్చుకుంది మణిశంకర్ అయ్యర్ వల్లనే. గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మణిశంకర్ అయ్యర్ మోదీ నీచుడంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 


కాంగ్రెస్ కు సీనియర్లే శత్రువులు

అయ్యర్ కామెంట్స్ ను నరేంద్ర మోదీ తెలివిగా ఉపయోగించుకున్నారు. దీంతో గుజరాత్ లో కాంగ్రెస్ కు తృటిలో అవకాశం చేజారి పోయింది.పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మరోసారి పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. దిగ్విజయ్ సింగ్ ఎప్పుడు ఏ మాట మాట్లాడినా… ఏ ట్వీటు చేసినా అది వివాదస్పదమే అవుతుంది. పుల్వామా దాడిపై ఆయన చేసిన కామెంట్స్ పై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఉగ్రవాదుల దాడిని పుల్వామా దాడిగా పేర్కొనడాన్ని తప్పు పడుతున్నారు. డిగ్గీ రాజా కామెంట్స్ ను ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ చక్కగా ఉపయోగించుకుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 46 మంది జవాన్లు మరణిస్తే దానిని ప్రమాదంగా చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీని మరోసారి డిగ్గీరాజా ప్రమాదంలోకి నిజంగానే నెట్టేశారు. గుజరాత్ ఎన్నికల సమయంలో మణిశంకర్ అయ్యర్ చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న పార్టీ హైకమాండ్ ఆయనను సస్పెండ్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత అయ్యర్ మీద సస్పెన్షన్ వేటునూ ఎత్తి వేసింది. మరి ఇప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ మీద కాంగ్రెస్ చర్యలు తీసుకున్నా అది నామమాత్రమేనన్నది అందరికీ తెలిసిందే. కాకుంటే ఇప్పుడు చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే డిగ్గీ రాజా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి. మరి పెద్ద తలకాయలను కంట్రోలు చేయకుంటే ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోక తప్పదు

No comments:
Write comments