సిట్టింగ్ స్థానాలకే మళ్లీ సీట్లు...

 

నెల్లూరు, మార్చి 11, (globelmedianews.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను ఊహించినట్లుగా జరగడం లేదు. సిట్టింగ్ లందరూ దాదాపు పట్టుబట్టి కూర్చున్నారు. తమకే టిక్కెట్ కావాలని గట్టిగా నిలదీసే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి దాకా దాదాపు నలభై నుంచి యాభై మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు పదిహేను పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉండే దాదాపు 65 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేశారు. అక్కడకక్కడ కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ పెట్టినా వారికి సీట్లు రావన్న గ్యారంటీ అయితే లేదు.. అసంతృప్తులను తగ్గించడానికి వారిని చివరి నిమిషంలో ప్రకటించే అవకాశముంది.
నియోజకవర్గాల పెంపుదల ఉంటుందని చంద్రబాబు గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఇబ్బడి ముబ్బడిగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుని కండువాలు కప్పేశారు. నియోజకవర్గాల పెంపుదల జరిగితే అందరికీ టిక్కెట్లు ఇవ్వవచ్చన్నది ఆయన ఆలోచన. అయితే నియోజకవర్గాల పెంపు జరగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకున్నారు. సిట్టింగ్  స్థానాలకే మళ్లీ సీట్లు...

వీరందికీ తిరిగి టిక్కెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే సంక్షేమ పథకాలతో పాటు పసుపుకుంకుమ, పింఛన్లు పెంపు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలతో చంద్రబాబు తన ఇమేజ్ పెరుగుతుందని భావించారు. పార్టీకి హైప్ వస్తే ఆటోమేటిక్ గా అసంతృప్తులు కూడా దారికి వస్తారని అనుకున్నారు.కాని తాను ఊహించని విధంగా ఇప్పుడు డేటా చోరీతో ఏపీ ప్రభుత్వం బద్నాం అయిందనే చెప్పాలి. అంతేకాదు వివిధ సర్వేల ఫలితాలు కూడా టీడీపీకి ప్రతికూలంగా రావడంతో సిట్టింగ్ లు గట్టిగా కూర్చున్నారు. గత పదిహేను రోజులుగా ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లిలో జరుగుతున్న సమావేశాల్లో ఇది స్పష్టంగా తెలుస్తోంది. అధిష్టానం నియమించిన పరిశీలకుల ఎదుటే సిట్టింగ్ లు తమకు టిక్కెట్ ఇవ్వకుంటే తాము ఏంచేయాలో తెలుసునన్న బెదిరింపు ధోరణికి దిగారు. ప్రకాశం జిల్లాకు చెందని ఒక రిజర్వ్ డ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే తనకు టిక్కెట్ ఇవ్వకుంటే తాను ప్రత్యర్థి పార్టీకి సహకరించి పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని బహిరంగంగా చెప్పడంతో పరిశీలకులు సయితం ముక్కున వేలేసుకున్నారట.ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే సిట్టింగ్ ల్లో దాదాపు 90 శాతం మందికి టిక్కెట్లు ఖాయంగా కన్పిస్తుంది. సర్వే నివేదికలు, హుంకరింపులు ఇప్పుడు టీడీపీ అధినేత నుంచి రావడం లేదన్న వ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తున్నాయి. సిట్టింగ్ లకు కాదని వేరే వారికి ఇచ్చే సాహసాన్ని టీడీపీ అధినేత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చేయలేరన్నది పార్టీలో టాక్. మొత్తం మీద చంద్రబాబు అనుకున్నట్లు, సర్వేల నివేదికలు చెప్పినట్లు నలభై నుంచి యాభై మంది సిట్టింగ్ లకు సీట్లు రావన్నది ఒట్టిమాటగానే కనపడుతుంది. కొన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను మార్చే అవకాశముందంటున్నారు.

No comments:
Write comments