మెడికల్ షాపులు నిలువు దోపిడి

 

వరంగల్, మార్చి 11, (globelmedianews.com)
మెడికల్ షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. ఫార్మసిస్టులు లేకుండా మందులు అమ్ముతున్నారు. మందులు కొనుగోలు చేసిన వినియోగదారులకు బిల్లులు సైతం ఇవ్వడం లేదు. అధిక లాభాల కోసం మందుల కొనుగోలుదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నియంత్రించాల్సిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మందుల దుకాణాల నిర్వాహకుల అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో అత్యధిక దుకాణాల్లో ఇదే పరిస్ధితి ఉంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా సూమారు 270 మెడికల్ షాపులు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి ఆనుకోని 110 మెడికల్ షాపులు ఉన్నాయి. కొన్ని మెడికల్ షాపులను ఆర్‌ఎంపీలు తమ క్లినిక్ దగ్గరలో నిర్వహిస్తున్నారు. 


మెడికల్  షాపులు నిలువు దోపిడి

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఫార్మసిస్టు లు, ఫార్మా కంపెనీల్లో పని చేస్తున్న ఫార్మసిస్టులు, ఫార్మా కళాశాలల్లో బోధిస్తున్న అధ్యాపకుల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లైసెన్సును పక్కన పెడితే ఏ ఒక్క మెడికల్ షాపులోనూ మందులు విక్రయించడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులు లేరు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజీవ్‌రాజ్ జనవరి మొదటి వారంలో ప్రైవేటు దవాఖానలు తనిఖీ చేసిన సందర్భంలో ఓ ప్రైవేటు దవాఖానలో డీ ఫార్మసిస్టులు ఉండాలి కానీ అక్కడ అర్హత లేని వారు మందులు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కనీసం మందులు నిల్వ చేయడంలోనూ ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి.ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో నాణ్యత లేని మందులు అమ్ముతున్నారని రెండు కంపెనీలపై, ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్‌పీ కన్నా అధిక ధర అమ్ముతున్న ప్రముఖ కంపెనీపై మరొకటి మెడికల్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేశారని అధికారులు తెలుపుతున్నారు. నమోదైన కేసులు విచారణలో ఉన్నాయి. మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు, ఫార్మసీ చట్టాలను అమలు చేయడం లేదు. అర్హత లేని వారు మెడికల్ షాపుల్లో మందులు విక్రయిస్తే చట్టం ప్రకారం రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

No comments:
Write comments