కమలానికి కలిసి రాని ఒంటరి పోరు

 

హైద్రాబాద్, మార్చి 13, (globelmedianews.com)
గ్రేటర్ హైద్రాబాద్ లో బీజేపీ బలహీనమైపోయింది. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నది. ఇందుకు రాష్ట్ర పార్టీ అధి నాయకత్వం కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒంటరిపోరుతో ఉనికిని కాపాడుకునేందుకు పార్టీ నాయకత్వం ఆరాటపడుతుంది. మరో పక్క లోకసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు సంశయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అవకాశాలు మెండుగా ఉన్న ఒక్క సీటు కోసం నలుగురు ముఖ్యనేతలు పోటీపడుతున్నారు. ఏ మాత్రం బలం లేని స్ధానాల్లో పోటీకి అభ్యర్ధుల అన్వేషణలో పార్టీలో మల్లగుల్లాలుపడుతుంది.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన ముఖ్య నేతల కోర్ కమిటీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేసినట్టు సమాచారం. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై ప్రాథమిక జాబితాను సిద్ధం చేసేందుకు పార్లమెంటు ఇన్‌ఛార్జులను నియమించారు. వారు సంబంధిత నియోజకవర్గాల్లో పోటీకి అర్హులైన ముగ్గురేసి సభ్యులతో కూడిన జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో  ఉనికిని కాపాడుకునేందుకు పార్టీ అధినాయకత్వం తీవ్రస్ధాయిలో మల్లగుల్లాలుపడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీలో కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే నేతలు కూడా లేకపోవడం బీజేపీ మరింత బలహీనమవడానికి కారణంగా పేర్కొనవచ్చు. 


కమలానికి కలిసి రాని ఒంటరి పోరు

ఎన్నికల సమయానికి సంపన్నవర్గాలు, పారిశ్రామికవేత్తలను అభ్యర్ధులుగా రంగంలోకి దింపడం, ఆ బడాబాబులు క్షేత్రస్ధాయిలో కార్యకర్తలను విస్మరించడం వంటి కారణాలతో పార్టీ బలపడలేకపోతుందన్న విమర్శలేకపోలేదు. పార్టీ బలపేతానికి రాష్ట్ర ముఖ్య నేతలు కూడా దృష్టి కేంద్రీకరించడం లేదని, ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ఆధిపత్యపోరుతో పార్టీని పూర్తి విస్మరించారన్న విమర్శ లేకపోలేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు శాసన సభకు కూడా ఒకే సారి జరిగాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొద్ది గొప్ప ఓటు బ్యాంకును కలిగి ఉన్న తెలుగు దేశం పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. దానికి తోడు ఆ సినీ గ్లామర్‌ను జోడించారు. జనసేనాని పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేశారు. ఈ కూటమితో బీజేపీ ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ స్ధానాన్ని దక్కించుకుంది. అదే విధంగా ఆ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఖైరతాబాద్, ముషీరాబాద్,అంబర్‌పేట స్ధానాలలో కాషాయ పతాకాన్ని ఎగురవేసింది. దీంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని గోషామహాల్ సెగ్మెంట్‌లను మాత్రమే బీజేపీ దక్కించుకుంది. కానీ ఈ లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాది నవంబరులో జరిగిన శాసనసభా ఎన్నికల్లో కూడా పార్టీ ఒంటరిపోరాటమే చేసింది. ఆ ఎన్నికల్లో గ్రేటర్ పరిధి మొత్తం మీద కేవలం ఒకే ఒక్క స్ధానానికి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తలపడేందుకు ముభావంతో ఉన్నట్టు కన్పిస్తుంది. క్షేత్రస్ధాయిలో కార్యకర్తలను ఎన్నికలకు సర్వసన్నర్ధం చేసే నాయకత్వం కూడా లేకపోవడం ఆ పార్టీకి ప్రధానలోపంగా పేర్కొనవచ్చు. దానితోడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు పార్టీ ఉనికిని కాపాడుకుంటువచ్చిన పార్టీ సీనియర్ నేత బద్ధం బాల్‌రెడ్డి మరణం కూడా పార్టీని తీరనిలోటుగా భావించవచ్చు. ఆ దిశగా కూడా పార్టీ సమాలోచనలో పడినట్టుగా తెలుస్తుంది.కమలం కోటగా పేర్కొనే లష్కర్ అభ్యర్ధిత్వం కోసం పార్టీ ముఖ్యనేతల్లో ప్రధానదళపతులు ముగ్గురు పోటీపడుతున్నట్టు తెలుస్తుంది. సిట్టింగ్ అభ్యర్ధి బండారు దత్తాత్రేయతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత కిషన్‌రెడ్డిలు సికింద్రాబాద్ లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మల్కాజిగిరి లోక్‌సభకు పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌లు ఆసక్తి చూపుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా చేవెళ్ల పార్లమెంట్ స్ధానానికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సమీప బంధువును బరిలోకి దింపేందుకు పార్టీ శ్రేణులు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ స్ధానానికి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసే దిశగా పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటుందో కాలమే నిర్ణయించాలి

No comments:
Write comments