సగం మండలాలు మహిళలకే...

 

రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం
హైద్రాబాద్, మార్చి 5, (globelmedianews.com)
రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్ష పదవి (ఎంపీపీ) రిజర్వేషన్ల కోటాను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ ఆదేశాలు జారీచేసింది. ముందుగా అనుకున్న ప్రకారం ఆయా స్థానా ల్లో సవరణల తర్వాత  జాబితా విడుదలచేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లను ఖరారుచేస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూప్రసాద్ జిల్లాలకు ఉత్తర్వులు జారీచేశారు. మండలం యూనిట్‌గా పరిగణించే ఎంపీపీ స్థానాలు రాష్ట్రంలో మొత్తం 535 ఉండగా, ఇందులో 33 స్థానాలను షెడ్యూల్ జాబితాకు బదిలీచేశారు. మిగిలిన 502 స్థానాల్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 251 మండలాలకు (50 శాతం) రిజర్వేషన్ల కోటాను ఖరారుచేశారు.షెడ్యూల్ మండలాలు మినహా మిగిలిన 502 స్థానాల్లో 50 శాతం రిజర్వేషన్ల ప్రకారం 251 స్థానాలకు రిజర్వేషన్ల కోటాను ఖరారుచేశారు. జిల్లాలవారీగా రిజర్వేషన్లను కేటాయించారు. 251 ఎంపీపీ స్థానాల్లో జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీలకు 59 స్థానాలు రాగా.. వీటిలో 30 మహిళలకు కేటాయించా రు. 


సగం మండలాలు మహిళలకే...

ఎస్సీలకు 98 స్థానాలు ఉండగా, 49 మహిళలకు, ఓటర్ల సంఖ్య ఆధారంగా.. బీసీలకు 94 స్థానాలు కేటాయించగా, మహిళలకు 47 దక్కాయి. జనరల్ స్థానాలు 251 ఉం డగా, 125 మహిళలకు కేటాయించారు. మొత్తం 535 స్థానాల్లో మహిళలకు 267 దక్కుతున్నాయి.రాష్ట్రంలో 13 జిల్లాల్లో మహిళలు ఎక్కువగా ఉండటంతో అక్కడ వారికి ఎక్కువస్థానాలు కేటాయించినట్టు జాబితాలో వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో మహిళలు 51.75 శాతం ఉండగా, నిర్మల్ 51.47, జగిత్యాల 51.10, కామారెడ్డి 50.77, మెదక్ 50.67, ములుగు 50.38, రాజన్న సిరిసిల్ల 50.36, జయశంకర్ భూపాలపల్లి 50.28, సిద్దిపేట 50.22, భద్రాద్రి కొత్తగూడెం 50.09, వరంగల్ అర్బన్ 50.09, కరీంనగర్ 50.08, వికారాబాద్ జిల్లాలో 50.01 శాతంగా మహిళలున్నట్టు పేర్కొన్నారు. మరో 17 జిల్లాల్లో సగటున 49.96 శాతం నుంచి 49.22 శాతంలో, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో 48.88 శాతంగా మహిళలు ఉన్నట్టు వెల్లడించారు.జనాభా ఆధారంగా ఆయా రిజర్వేషన్లలో మహిళా కోటాను కొంతమేరకు తగ్గించినట్టు జాబితాలో వెల్లడించారు. మహిళలకు 50 శాతం కోటాను సమం చేయడానికి ఈ నిర్ణ యం తీసుకున్నారు. షెడ్యూల్ ఏరియాలో 33 స్థానాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 స్థానాల్లో ఒక స్థానాన్ని మహిళకు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకే స్థానం ఉండగా దీన్ని జనరల్‌గా కేటాయించారు. జనరల్‌స్థానాల్లో వికారాబాద్ జిల్లాలో 9 ఉండగా 4, నారాయణపేట జిల్లాలో 5 స్థానాల్లో 2, మహబూబాబాద్ జిల్లాలో 5 స్థానాల్లో 2, ఆదిలాబాద్ జిల్లాలో 5 స్థానాల్లో 2, మహబూబ్‌నగర్‌లో 7 స్థానాల్లో 3, సంగారెడ్డి జిల్లాలో 13 స్థానాల్లో 6, వనపర్తి జిల్లాలో 7 స్థానాల్లో 3, రంగారెడ్డిలో 11 స్థానాల్లో 5 మండలాలను మహిళలకు కేటాయించారు. ఎస్సీ రిజర్వేషన్లలో మహబూబ్‌నగర్, మంచిర్యాల జిల్లాల్లోని మూడేసి స్థానాల్లో మహిళలకు ఒక్కోస్థానం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఒక స్థానం ఉండగా జనరల్‌కు కేటాయించారు. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూడేసి స్థానాల్లో మహిళలకు ఒక్కొక్కటి, వనపర్తి జిల్లాలో 5 స్థానాల్లో మహిళలకు 2 కేటాయించారు.ఇక షెడ్యూల్ ఏరియాలో ముందుగా గుర్తించని మూడు మండలాలను షెడ్యూల్ జాబితాలోకి తీసుకున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వరంగల్, ఖమ్మం జిల్లా పరిషత్ పరిధిలోని బయ్యారం, గార్ల, గంగా రం మండలాలను షెడ్యూల్ మండలాలుగా పేర్కొంటూ ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఇప్పటివరకు జనగాం జిల్లాలో కొనసాగిన గుండా ల మండలాన్ని ఇక నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగించాలని ఆదేశాలిచ్చారు. ఎంపీపీ రిజర్వేషన్ల జాబితాలో ఈ మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలుపాలని ఆదేశించారు. ముందుగా షెడ్యూల్ మండలాలు 24 ఉండగా.. సవరించిన జాబితా ప్రకారం 33కు చేరుకున్నాయి. దీంతో ఎస్సీ, బీసీలకు స్థానా లు తగ్గాయి. రిజర్వేషన్ల కోటాను ఫైనల్ చేస్తూ ఇదే ఫార్మాట్‌లో కోటా కేటాయించాలని ఆదేశాలిచ్చారు. మొత్తం 535 ఎంపీపీ స్థానాల్లో 33 షెడ్యూల్ మండలాలుగా పేర్కొన్నారు.

No comments:
Write comments