గడ్డికీ దిక్కులేదు (ఆదిలాబాద్)

 

ఆదిలాబాద్, మార్చి 19 (globelmedianews.com): 
కాలం రైతన్నలను కష్టాల్లోకి నెట్టేస్తోంది. వేసిన పంటలు వరదలకు కొట్టుకుపోగా, కనీసం పశువులను కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. వాటి కడుపు నింపేందుకు మేత దొరక్కపోవడంతో కళ్లముందే మృత్యుఒడికి చేరుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించే పరిస్థితి దాపురించింది. వాటి పెంపకమే భారంగా మారింది. మేత దొరక్క ప్లాస్టిక్‌ కవర్లను తింటూ మృత్యుఒడికి చేరుతున్నాయి.జిల్లాలో దాదాపుగా 6.80 లక్షల వరకు పశువులు ఉన్నాయి. ఎక్కడ కూడా వీటికి సరిపడా ఆహారం అందని పరిస్థితి నెలకొంది. అడవుల్లోను, పంటపొలాల్లో మేపే పరిస్థితి లేదు. అడవులకు వెళ్లి పరిగడుపుతోనే తిరిగి వస్తున్నాయి. కనీసం ఇంటి వద్ద మేత వేద్దామన్నా రైతన్నల ఇంట ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఏమీ చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. బయట మేత దొరక్కపోవడంతో పాటు కొనే పరిస్థితి లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. గడ్డికీ దిక్కులేదు (ఆదిలాబాద్)

రైతులు ఎక్కువగా పత్తి, సోయా, శనగ పంటలపై దృష్టి సారించడంతో పశుగ్రాసం వేసే పరిస్థితి కనిపించడం లేదు. వెరిసి వీటి ధరలు భగ్గుమనడంతో పశుపోషకులు అంత ధరలు పెట్టి వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. అసలే సన్న, చిన్నకారు రైతులు ఉండడంతో వాటి ధరలను చూసి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ప్రతి రైతు తన ఎడ్లు, పశువుల కోసం పశుగ్రాసం కోసం పొలంలో కొంత స్థలాన్ని కేటాయించి పంటలను సాగు చేసేవారు. వీటితో తమపోషణతో పాటు పశువులకు ఆహార సమస్యలు తీరేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
పశువులు పెంచుకునే రైతులు వాటిని సాదే పరిస్థితి లేక కనీసం అమ్ముదామన్నా ధరలు రాక ముందు నుయ్యీ వెనుక గొయ్యీల మారింది పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్‌లోను వీటిని కొనకపోవడంతో ఇంటి వద్దే ఉంచుదామన్నా వాటికి మేత లేకపోవడంతో తల్లడిల్లుతున్నారు. గతంలో పదుల సంఖ్యలో ఆవులు ఉన్నవారు కనీసం అందులో సగమైనా పెంచుకొనే పరిస్థితి లేదు. వీటితో పాటు గేదెల పరిస్థితి అదే తీరిన కొనసాగుతోంది. దీంతో పాల ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడంతో పల్లెల్లోను పాల పొట్లాలపై ఆధారపడుతున్నారు
ఏ గ్రామంలో చూసినా పాలిథిన్‌ కవర్లు పెనుభూతంలా మారాయి. కిరాణకొట్టులు, హోటల్‌, పాన్‌షాప్‌లు, ఇళ్లల్లో ఎక్కువగా వీటి వినియోగం పెరగడంతో పాటు విరివిగా రోడ్లపై పారేయడంతో వాటిని తింటూ ఎన్నో మూగజీవులు జీవం విడుస్తున్నాయి. ప్రస్తుతం శుభకార్యాలలోను ప్లాస్టిక్‌ ఇస్తార్లను ఎక్కువగా వినియోగించడంతో ఆహారం కోసం వాటిని తింటూ మృతిచెందుతున్నాయి. ఇలా ఒక్కో ఏడాదిలోనే వేల సంఖ్యలో పశువులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాల కారణంగా ఒక్క నెలలోనే దాదాపుగా సిరికొండలో 12 పశువులు మృతి చెందాయి. వీటిని గ్రామ సమీపంలో వేయడంతో ఇలా కనిపించాయి. ఇలా ఒక్కచోటే కాదు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.

No comments:
Write comments