దత్తత గ్రామాల్లో కనిపించని గ్రామ జ్యోతి

 

మహబూబ్ నగర్, మార్చి 13,(globelmediaenws.com)
ఎంతో ఆర్భాటంగా దత్తత గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాజకీయ నేతలు హామీలు ఇవ్వడంలో చూపించిన శ్రద్ధ పల్లెల అభివృద్ధి, సంక్షేమ పనుల్లో మాత్రం చూపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గ్రామంలో సమస్యలను త్వరగా పరిష్కరించి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభ సమయంలో ఎంతో ఉత్సాహంగా గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి పనులు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు. గ్రామాల్లోని సమస్యలు, ప్రజల అవసరాలు గుర్తించి దశలవారీగా పనులు చేపట్టే లక్ష్యంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఆ లక్ష్యం ఇంకా నెరవేరడం లేదు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాలను సైతం దత్తత తీసుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికి నేటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోవడం విడ్డూరంగా ఉందని చెప్పవచ్చు. 


దత్తత గ్రామాల్లో కనిపించని గ్రామ జ్యోతి

2015 ఆగస్టు 17న అప్పటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్.. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అప్పటి నుంచి కొన్ని రోజులపాటు అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని కొనసాగించారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలు, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు, వ్యవసాయం, మురుగుకాల్వల పరిస్థితి, మంచినీటి సరఫరా విధానం, వనరులు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, నిరక్షరాస్యత, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై చర్చించి ప్రణాళికలు తయారు చేశారు. కేవలం కొన్ని రోజులు మాత్రమే పరిసరాలు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో గుర్తించిన పనులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభించి సుమారు మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదు. గ్రామజ్యోతిలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాలను సైతం దత్తత తీసుకున్నారు. కార్యక్రమం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ దత్తత గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పవచ్చు. దత్తత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతామని ప్రారంభంలో హామీలు గుప్పించారని, ఆచరణలో అమలుకు సాధ్యం కాలేదు. అప్పట్లో పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. ఆ తర్వాత నుంచి దత్తత గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

No comments:
Write comments