అక్కరకు రాని అమృత్ (తూర్పుగోదావరి)

 

కాకినాడ, మార్చి 6 (globelmedianews.com): 
జిల్లాలోని నగరపాలక సంస్థలకు అమృత్‌ పథకం వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువశాతం నిధులను తాగునీటి పథకాలకు ఖర్చుచేసే వెసులుబాటు ఇందులో ఉంది. రూ. కోట్ల నిధులు మంజూరవుతున్నా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతుండటం వల్ల తాగునీటి సమస్యల పరిష్కారానికి అడుగులు పడడం లేదు. ఇప్పటి వరకూ రెండు దఫాలు నిధులు విడుదల చేయగా, మొదటివి ఖర్చు చేసినా రెండోసారి వచ్చిన నిధుల వినియోగంలో జాప్యం నెలకొంటోంది.
రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో దాదాపు  రూ. 200 కోట్లు ఖర్చు కాలేదు. ఫలితంగా రెండు నగరాల్లోని చాలా ప్రాంతాల్లో తాగునీరు అందని పరిస్థితి. వేసవి సమీపిస్తున్న  వేళ మరింత గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందే మేల్కొంటే ప్రజలు నీటి నష్టాలు పడాల్సిన అవసరం ఉండదు.


అక్కరకు రాని అమృత్ (తూర్పుగోదావరి)


జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల్లో కొన్ని ఎగువ ప్రాంతాలకు, వాంబే కాలనీలకు తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. ఇందులో కాకినాడలోని ముత్తానగర్‌, మహాలక్ష్మినగర్‌, ఎస్‌.అచ్యుతాపురం, ఏటిమొగ వంటి ప్రాంతాల్లో మామూలు రోజుల్లోనే నీటి కొరత వేధిస్తోంది. ఇక వేసవిలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడ మొదటి దఫాలో వచ్చిన రూ. 40 కోట్లలో నగరంలో 13 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైను నిర్మాణం, 20 వేలు కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. రెండో దఫాలో దాదాపు రూ. 120 కోట్ల నిధులు వచ్చాయి. కానీ ఎగువ ప్రాంతాల్లో తలెత్తే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైప్రాంతాల్లో సమస్య తలెత్తినప్పుడు ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తున్నారు తప్పా, శాశ్వత పరిష్కారానికి కృషి చేయడం లేదు. కొన్ని ప్రాంతాలకు నిధులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుండగా ఇక్కడ నిధులు పుష్కలంగా ఉండీ పనులు జరగటం లేదు. ఇప్పటికైనా మేల్కొని అధికారులు పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
రాజమహేంద్రవరానికి గోదావరి అత్యంత సమీపంలో ఉంది. కానీ కొన్ని ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. 49, 50 డివిజన్లలో, ఆవలోని వాంబే కాలనీలో ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు తప్పా అవి సరిపోని పరిస్థితి. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ధవళేశ్వరం నుంచి ఆవకు వచ్చే పైపులైను తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో సక్రమంగా నీరు అందడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి అత్యవసర మౌలిక వసతుల కల్పన పథకం ద్వారా రూ. తొమ్మిది కోట్లతో కొత్త పైపులైను వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. రాజమహేంద్రవరానికి తొలి విడతలో రూ. 3.30 కోట్ల నిధులు మంజూరు కాగా వాటిని పూర్తిగా ఖర్చుచేయగా మలివిడత వచ్చిన రూ. 105 కోట్లలో రూ. 19 కోట్లతో అయిదు ఎమ్మెల్డీ ఎస్టీపీ ప్లాంటు నిర్మాణం చేపట్టారు. మిగిలిన నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నిరంతరం ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు తప్పా శాశ్వత పరిష్కారానికి ఇక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు.
జిల్లాలో అమృత్‌ పథకం కింద దాదాపు రూ. 200 కోట్ల నిధులున్నాయి. ప్రతిపాదించిన పనులను సకాలంలో పూర్తిచేస్తే ఈ వేసవిలో నీటి ఎద్దడిని నివారించవచ్చు. తాగునీటి పథకాల నిర్మాణానికి ఇప్పటికే దాదాపు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తే మార్చి నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. తద్వారా వేసవిలో ప్రజలకు సమృద్ధిగా నీటిని అందించవచ్చు. ఎగువ ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తేనే అక్కడి సమస్య పరిష్కరం అయ్యే అవకాశం ఉంది. అధికారులు ఈ పనులపై దృష్టిసారిస్తే నిధుల వినియోగం అయ్యే అవకాశం ఉంది.

No comments:
Write comments