ఖమ్మం ఖల్లా... ఎవరికి విల్లా

 

ఖమ్మం, మార్చి 13, (globelmedianews.com)
లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యంలో ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా కమ్యూనిస్టు పార్టీలు ఈసారి ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపధ్యంలో నలుగురి అభ్యర్థుల మధ్య పోటీ నడిచే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడు కాంగ్రెస్, రెండు తెలుగుదేశం, ఒకటి టీఆర్‌ఎస్, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తరువాత జరిగిన రాజకీయ పరిమాణాల్లో స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఈనేపధ్యంలో నేతలు ఎలావున్నా కాంగ్రెస్ బలంగా ఉందనే సాకుతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కూసంపూడి రవీంద్ర బరిలో నిలిచే అవకాశం ఉంది. కాగా అధికార టిఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ తాజాగా ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరు వినిపిస్తోంది. అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 


ఖమ్మం ఖల్లా... ఎవరికి విల్లా

ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రజల్లో ఆదరణ మంచిగానే ఉన్నప్పటికీ ఆ పార్టీలోని రాజకీయ వైరుధ్యాలే ఆయనకు టికెట్ రాకుండా చేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి అనుచరులు తమకు మద్దతు ఇవ్వలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే తాము కూడా మద్దతివ్వమని కొందరు ప్రధాన నేతలు చెప్పడం వల్లే ఆయనకు టికెట్ నిరాకరించారని ఆపార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన తరువాత టిఆర్‌ఎస్‌లో చేరిన పొంగులేటి తన అభ్యర్ధిత్వం ఖరారు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కెటిఆర్‌తో తనకున్న సన్నిహిత సంబంధాలను వినియోగించుకొని టికెట్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సన్నిహితుడు కావడంతో ఆయన సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మధ్యేమార్గంగా ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరును తెరపైకి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈయన తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, రాహుల్‌గాంధీ జాబితాలో రాజేంద్రప్రసాద్ పేరు ఉన్నదని ప్రచారం జరిగిన నేపధ్యంలో గడిచిన రెండు రోజుల్లో రాజేంద్రప్రసాద్ పేరు టిఆర్‌ఎస్ జాబితాలో రావడం విశేషం. దీంతో ఖమ్మంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీలో ఉండేందుకు ఆశావహుల సంఖ్య పెరగడమే కాకుండా కెసిఆర్ కూడా ఖమ్మంపైనే ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా దేశంలోనే కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ఖమ్మంలో ఈఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించిన నేపధ్యంలో బలమైన అభ్యర్ధిని పోటీలో నిలిపేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మేధావి వర్గానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో నిలపనున్నట్టు సమాచారం.

No comments:
Write comments