రేషన్ షాపుల్లోకి రాని కంది

 

ఒంగోలు, మార్చి 9, (globelmedianews.com)
చౌకదుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించినప్పటికీ జిల్లాకు అవసరమైన కోటా మాత్రం అందలేదు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఇచ్చిన హామీతో రేషన్ కార్డుదారులు సంతోషించారు. ఇప్పటికే కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తూ పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో కాసింత ఉపశమనం పొందేందుకా అన్నట్లు మార్చి నెల నుంచి కార్డుకు కిలో కందిపప్ప ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బియ్యంతో పాటు గత రెండు నెలల నుంచి అర కిలో చక్కెరను కూడా సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు జిల్లాకు అవసరమైన కోటా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం కావడం ప్రజల్లో విమర్శలకు దారి తీసింది. చౌకదుకాణాల వద్ద అడిగితే ఈ నెల కోటా రాలేదంటూ డీలర్లు సమాధానం చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలో కొన్ని చౌకదుకాణాల్లో రాగులు కూడా సరఫరా చేస్తున్నారని సమాచారం. కాగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు చౌక దుకాణాల ద్వారా ఒక కిలో కందిపప్పు రూ.40కు సరఫరా చేయాలి. 

 
రేషన్ షాపుల్లోకి రాని కంది

బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో కందిపప్పు రూ.80 నుంచి రూ.120 వరకు ఉంటోంది. ఈ క్రమంలో గుడ్డిలో మెల్ల తరహాలో కనీసం కిలో కందిపప్పు వచ్చినా ఊరట కలుగుతుందని రేషన్ కార్డుదారులు ఆశపడ్డారు. ఈ నెల ప్రారంభం నుంచి కూడా తమ చౌకదుకాణాలకు కందిపప్పు రాలేదని, ఇకపై రాదని డీలర్లు నిత్యం లబ్ధిదారులకు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో జన్మభూమి-మా ఊరు గ్రామ సభలకు ముందు 11.20 లక్షల రేషన్‌కార్డులు ఉండేవి. జన్మభూమిలో ఇచ్చిన కొత్త కార్డులు కలిపి ప్రస్తుతం 12 లక్షల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో గత నెలలో దాదాపు 80 కొత్త కార్డులు అదనంగా చేరాయి. వీటన్నింటికీ కలిపి జిల్లా కోటా మేరకు 11.50 టన్నులు కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. కానీ కేవలం 3.50 టన్నులు మాత్రమే జిల్లాకు తూతూమంత్రంగా పంపించారు. ఇది ఏ మూలకూ చాలలేదు. దీన్ని జిల్లాలోని మూడు, నాలుగు మండలాలకే పంపించారు. అదీ బలమైన ప్రజా ప్రతినిధులున్న ఏరియాకే ప్రభుత్వ విధానం తెలియజేయడానికి వీలుగా పంపినట్లు విమర్శలున్నాయి. మార్కెట్ ఫెడ్ వద్ద నిల్వ ఉన్న కందుల్ని పప్పుగా మార్చి సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిచింది. మార్క్‌ఫెడ్ తయారు చేసే కందిపప్పులో 65 శాతం చౌక దుకాణాలు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డిమాండ్ పెరగడంతో అన్ని జిల్లాలకూ కందికప్పును సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మేరకు తూతూమంత్రంగా జిల్లాలకు కందిపప్పు సరఫరా చేసి చేతులు దులిపేసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా వచ్చే నెల(ఏప్రిల్)లో కోటా మేరకు కందిపప్పు జిల్లాకు వస్తుందని సివిల్ సప్లయ్స్ అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనైనా ప్రతి కార్డుదారుడికి అందుతుందో, లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నిరంతరం కందిపప్పు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వచ్చే నెలలోనైనా ప్రభుత్వం హామీని నిలుపుకుంటే సరే.. లేకుంటే అభాసుపాలు కాక తప్పదని లబ్ధిదారుల్లో చర్చ సాగుతుండటం విశేషం.

No comments:
Write comments