భారీగా పెరిగిన సోయాబీన్

 

నిజామాబాద్, మార్చి 9, (globelmedianews.com)
సోయాబీన్ విత్తనాన్ని అధిక ధరను వెచ్చించి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆసక్తి చూపుతోంది. ఫలితంగా ఇటు రైతులపై భారం పడటంతో పాటు, ప్రభుత్వంపై కూడా సబ్సిడీ భారం పెరగనుంది. రానున్న ఖరీఫ్ సీజన్‌కు సోయాబీన్‌కు క్వింటాల్‌కు రూ.6100కు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ టెండర్లు ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు 2 లక్షల క్వింటాళ్లు వచ్చే ఖరీఫ్‌కు సోయాబీన్ విత్తనం అవసరమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గడిచిన ఖరీఫ్‌లో సోయాబీన్ సాగు చేసిన రైతులకు మద్ధతు ధర రాక నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా ఎంఎస్‌పి రూ.3339 ప్రకటించినప్పటికీ, రైతులకు మార్కెట్‌లో రూ.2500 నుంచి రూ.3000ల మధ్యలోనే ధర అందింది. 


భారీగా పెరిగిన సోయాబీన్

అదే సందర్భంలో ఇప్పుడు విత్తన కొనుగోలును మాత్రం క్వింటాకు రూ.5500లకు చేసి,రవాణా ఇతరత్రా ఛార్జీలకు క్వింటాకు రూ.600 చొప్పున కలుపుతూ మొత్తంగా రూ.6100కు ధర ఖరారు చేయాలని చూస్తోంది. గత ఏడాదితో చూస్తే క్వింటాకు రూ.100 మాత్రమే తగ్గించడం గమనార్హం. గత ఖరీఫ్‌లో 40.32 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వంపైనా కూడా ఆర్థిక భారం పెరిగింది.మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రల నుంచి సోయాబీన్ విత్తనం కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.వాస్తవానికి పంట ఉత్పత్తికి, విత్తన రేటుకు వత్యాసం ఉంటుంది. అయితే అది ఈ స్థాయిలో ఉండదని విత్తన నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో సోయాబీన్ ధర రూ. 3 వేల లోపు మాత్రమే ఉంది. అటువంటిది క్వింటా విత్తనానికి రూ.5500 పెట్టి కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొనుగోలు చేసిన దానికి కూడా రవాణా, ఇతరత్రా ఛార్జీల పేరుతో రూ. 600లు కలపడంతో క్వింటా రూ. 6100లకు చేరింది. ఈ ధరతో రైతులపై, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. పెంచిన సబ్సిడీ భారం మొత్తం ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ప్రాసెసింగ్‌కు, ప్యాకింగ్, రవాణాకు అన్నింటికి కలిపినా రూ.5400 వరకు మించదని అటువంటిది రూ.6100 చెల్లించడంలో మతలబు ఏమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఒక క్వింటాకు రూ.700 పైనా చేతులు మారుతున్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నాయి.

No comments:
Write comments