యదేఛ్చగా గంజాయి అక్రమ రవాణా

 

నాలుగు శాఖల నిర్లక్ష్యం
ఖమ్మం, మార్చి 13, (globelmedianews.com)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఒడిశా, చత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఇష్టారాజ్యంగా సాగుతోంది. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. సమాజాన్ని పతనావస్థకు చేరుస్తున్న గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణ బాధ్యతను ఎవరూ సక్రమంగా నిర్వర్తించలేక పోతున్నారు. గంజాయి రవాణాను అడ్డుకోవటంలో ఎక్సైజ్ శాఖ పాత్ర ఎక్కువ. కానీ ఈ శాఖాధికారులు మారుమూల ప్రాంతాల్లో సమాచారం ఉంటే తప్ప పట్టించుకోవడం లేదు.అక్రమంగా వివిధ దారుల్లో రవాణా అవుతోంది. దీన్ని నియంత్రించాల్సిన పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖలకు ఇతర బాధ్యతల భారం అధిక కావడం స్మగ్లర్లకు కలిసొస్తోంది. మారుమూల గిరిజన గ్రామాల్లో పండిస్తున్న గంజాయిని జాతీయ రహదారి వరకు సురక్షితంగా రెండు, మూడు విడతలుగా చేర్చేందుకు గిరిజనులు, గ్రామీణులు, స్లగ్లర్లు రవాణాదారులుగా మారుతున్నారు. పోలీసు శాఖ నిరంతరం కాకుండా అప్పుడప్పుడూ రహదారులపై తనిఖీలు నిర్వహిస్తూ అరకొరగా సరకు పట్టుకుంటోంది. ఇక రెవెన్యూ, అటవీ శాఖలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చే మార్గాల్లో తరచూ నాకాబందీ నిర్వహిస్తే గంజాయి రవాణాకు కొంతవరకైనా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.యదేఛ్చగా గంజాయి అక్రమ రవాణా

 గంజాయి రవాణాపైనే కాకుండా సాగు, సరకు చేరుతున్న ప్రదేశాలపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. గంజాయి రవాణా, నిల్వలకు సంబంధించి ఎవరైనా నిర్దిష్ట సమాచారం అందిస్తే అలాంటి వారికి పట్టుబడిన గంజాయి విలువ ప్రకారం కిలోకు రూ. 80చొప్పున నగదు రివార్డు చెల్లించాల్సి ఉంది. కానీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అటు గంజాయి రవాణాను, ఇటు గంజాయిని పట్టించిన వారి గురించి పట్టించుకోవడం లేదు. దీనికితోడు క్షేత్రస్థాయిలో కీలకమైన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు గంజాయి రవాణాను నిరోధించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణ బాధ్యతను సంబంధిత శాఖలు పటిష్టంగా తీసుకునేలా ప్రభుత్వాలు ఆదేశాలిస్తే నియంత్రణ సాధ్యపడుతుందని పలువురు సూచిస్తున్నారుగంజాయి స్మగ్లర్లు ఇచ్చే భారీ మొత్తానికి ఆశపడి అమాయక గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల కూలీలు గంజాయిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం మేరకు పట్టుబడున్నది వందల కేజీల్లోనే ఉంటుంది. అక్రమంగా అధికారుల కన్నుగప్పి తరలిపోతున్న సరుకు కోట్ల రూపాయల్లో ఉంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏజెన్సీకి సరిహద్దున ఉన్న చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులోని ఒడిశా సమీప గ్రామాల్లో ఎక్కడచూసినా గంజాయి వనాలే. భద్రాచలం - చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ఒడిశాలోని మన్యం ప్రాంతం గంజాయి తోటల పెంపకానికి కేంద్రబిందువుగా ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల సరిహద్దున ఉన్న సీలేరు నది పరీవాహక ప్రాంతంలోని ఒడిషా గ్రామాలు పుప్పులూరు, సరిగడ్డ, పసుపులంక, జోడం, సన్యాసిగూడ, కుర్మనూరు, నిమ్మలపాలెం, గిల్లమడుగు, తెందులూరు, రాచాబేడ, సబన్‌గూడ, అల్లూరుకోట, గుర్రాలూరులో గంజాయి వనాల పెంపకం నిరాటంకంగా సాగుతోంది. ఇక్కడ పెంచిన గంజాయి దేశంలోని పలు పట్టణ ప్రాంతాలకు అడ్డదారుల్లో స్మగ్లింగ్ అవుతోంది. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో సారవంతమైన భూములు లేక పంటలు పండకపోవడంతో జీవనాధారం కోసం గంజాయి వనాల పెంపకం వైపు ఆప్రాంత వాసులు ఆకర్షితులవుతున్నారు. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు స్మగ్లర్ల ప్రోత్సాహం లభిస్తోంది. గిరిజనుల్లోని నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని గంజాయి విషవనం ఊబిలోకి లాగుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే మార్గం అంటూ స్మగ్లర్లు ఆశ చూపడంతో గంజాయి సాగుకు ఈ ప్రాంతవాసులు మొగ్గుచూపుతున్నారు.వరి, చెరకు వంటి పంటల సాగులో రైతులు పురాతన వ్యవసాయ విధానాలనే ఇప్పటికీ అనుసరిస్తుండగా మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి సాగుకు బిందుసేద్యం, ఎత్తిపోతల వంటి అధునాతన పద్ధతులు అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అధిక ఆదాయం వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో గిరిజనులు రిజర్వ్ ఫారెస్టును పోడు భూములుగా మార్చి గంజాయి పండిస్తున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రకంగా గుర్తింపు పొందిన శీలావతి గంజాయి సాగుకు సరిహద్దు ప్రాంతం అత్యంత అనుకూలంగా ఉండటంతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఈ ప్రాంతంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఇదిలావుంటే గంజాయి సాగు ఎక్కువగా భద్రత రీత్యా పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులు వెళ్లేందుకు సాహసించని మారుమూల గిరిజన ప్రాంతాల్లో జరుగుతోంది. గిరిజనులకు ముందుగా పెట్టుబడి, వస్తుసామగ్రి అందజేసి వారు పండించిన పంటను మళ్లీ తమకే విక్రయించేలా స్మగ్లర్లు, దళారులు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.గంజాయి స్మగ్లింగ్‌కు తెలంగాణ, ఆంధ్రా, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న భద్రాచలం రాజమార్గంగా మారింది. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణలోని భద్రాచలం రావడానికి సులువైన మార్గం ఉంది. ఈనేపథ్యంలో రూ. కోట్ల విలువైన గంజాయి ఈ సరిహద్దు నుంచే దేశం నలుమూలలకూ తరలడం గమనార్హం. స్మగ్లర్లు వివిధ పద్ధతుల్లో గంజాయిని చాకచక్యంగా దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేస్తున్నారు. గంజాయిపై నిర్దిష్టమైన నిఘా అంటూ లేకపోవడంతో క్వింటాళ్లకొద్దీ సులువుగా తరలిపోతోంది. ఎవరైనా సమాచారం ఇస్తేతప్ప పట్టుబడటం లేదు. అయితే గంజాయి తరలింపులోనూ స్మగ్లర్లు అధికారులను సులువుగా పక్కకు తప్పిస్తున్నారు. క్వింటాళ్లకొద్దీ గంజాయి రవాణా చేసేటప్పుడు అదేరోజు 20, 30 కిలోల గంజాయి పట్టుబడేలా చూసుకుంటున్నారు. పోలీసులు, ఆబ్కారీ అధికారుల దృష్టంతా పట్టుకున్న గంజాయి పైనే ఉన్న క్రమంలో సులభంగా భారీ మొత్తంలో గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. రంపుపుపొట్టు మాటున, మామిడికాయలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతరత్రా వస్తువుల మాటున గంజాయిని స్మగ్లర్లు సులభంగా తరలించేస్తున్నారు.తెలంగాణ సరిహద్దులోని ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో పండిస్తున్న గంజాయిని కొందరు దళారులు కొనుగోలు చేసి సీలేరు నది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నాటుపడవల ద్వారా తరలిస్తున్నారు. నకిలీ పర్మిట్ తీసుకొని లారీల ద్వారా ప్రధాన మార్గంలోనే తరలిస్తున్నారు. అయితే ఎప్పుడైనా తనిఖీలు జరిగితే గిరిజనులే సమిధలుగా మారుతున్నారు. ఈ స్మగ్మింగ్ దందాలో ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలకు చెందిన అనేక మంది గిరిజనులు జైళ్లలో మగ్గుతున్నారు. పొరపాటున ఎవరైనా పట్టుబడితే నెలల తరబడి జైలులో ఉండాల్సి వస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే స్మగ్లర్లు పెట్టుబడిపెట్టి వారిని విడిపిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు పలు సందర్భాల్లో అధికారుల ప్రమేయం కూడా ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

No comments:
Write comments