ఖర్గే కు ఎసరు పెడుతున్నారా...

 

బెంగళూర్, మార్చి 7, (globelmedianews.com)
లోక్ సభ ఎన్నికల నాటికి కర్ణాటక రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చెప్పలేం. పార్టీలు మారే వాళ్లు కొందరైతే… ఉన్న పార్టీలోనే ఉండి పార్టీలోని తమ ప్రత్యర్థులను ఓడించాలన్నది కొందరి వ్యూహం. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సంకీర్ణ సర్కార్ లో ఇదే జరుగుతుంది. పార్టీని ఇప్పటికిప్పుడు కొందరు వీడకపోయినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని కొందరు కాచుక్కూర్చున్నారు. అదను కోసం వేచి చూస్తున్నారు. పార్టీలో తమ ప్రత్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని కొందరు నిర్ణయించుకోవడం కాంగ్రెస్ నేతల్లో కలవరం పుడుతోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉమేష్ జాదవ్ రాజీనామాకు ప్రధాన కారణం అధిష్టానంపై ఆగ్రహం ఒకటి కాగా, రెండోది లోక్ సభ లో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా మరో కారణం. నిజానికి మల్లికార్జున్ ఖర్గే శిష్యరికంలోనే ఉమేష్ జాదవ్ రాజకీయంగా ఎదిగారు.


ఖర్గే కు ఎసరు పెడుతున్నారా...

గత కొన్నాళ్ల నుంచి ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యవహారశైలి కారణంగానే జాదవ్ పార్టీ మారారన్న ప్రచారమూ ఉంది. ప్రియాంక్ ఖర్గే తన నియోజకవర్గమైన చించోలిలో కూడా జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు జాదవ్ చెప్పినా లైట్ గా తీసుకోవడంతోనే ఆయన పార్టీని వీడారంటున్నారు.మల్లికార్జున్ ఖర్గేను ఎలాగైనా ఓడించాలన్నది బారతీయ జనతా పార్టీ లక్ష్యం. కలబురిగి పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లికార్జున్ ఖర్గే ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగే అవకాశముంది. ఆయన 11 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయనపై పోటీకి ఉమేష్ జాదవ్ ను నిలపాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్లాన్ చేస్తున్నారు. ఖర్గే అంటే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలకు కూడా పడదు. ముఖ్యంగా సిద్ధరామయ్య వంటి నేతలు ఖర్గేను పరోక్షంగా వ్యతిరేకిస్తుంటారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెడుతున్నందునే ఆయనపై అనేకమంది కాంగ్రెస్ నేతలు లోలోపల ఆగ్రహంగా ఉన్నారు. కలిబురిగిలో మల్లికార్జున్ ఖర్గే ఓడిపోవాలని కాంగ్రెస్ నేతలే తమ మనసులో కోరుకుంటున్నారన్నది వాస్తవం. ఇటీవలే ఖర్గేకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బాబూరావు సయితం బీజేపీలో చేరారు. ఇలా ఖర్గేకు ఒక్కొక్కరినీ దూరం చేస్తూ కలబురిగిని కైవసం చేసుకోాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇందుకు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద సీనియర్ నేత ఖర్గేపై కాంగ్రెస్ నేతలే కత్తి కట్టారన్న వ్యాఖ్యలు కన్నడనాట విన్పిస్తున్నాయి. మరి ఖర్గే మాత్రం ఇవే తన చివరి ఎన్నికలు అని చెబుతున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

No comments:
Write comments