పొంచి ఉన్న ముప్పు (చిత్తూరు)

 

తిరుపతి, మార్చి 6 (globelmedianews.com):
తిరుపతి నగరానికి నీటి ముప్పు పొంచి ఉంది. 2015 నవంబరులో కురిసిన అతి భారీ వర్షాలకు భూగర్భ నీటి మట్టం అమాంతం పెరిగి నేటి వరకు తాగునీటి సమస్య తలెత్తలేదు. ఆ తరవాత వర్షాలు అప్పుడప్పుడు పడుతుండడంతో నీటి అవసరాలు ఎప్పటికప్పుడు తీరుతున్నాయి. 2019 జనవరి వరకు నగరవాసులు నీటి కోసం పెద్దగా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఈ ఏడాది వేసవిని జయించడం కష్టమని తిరుపతి నీటి సరఫరా వనరులైన కల్యాణిడ్యామ్, కైలాసగిరి రిజర్వాయర్‌ నిల్వలు చెబుతున్నాయి. ఇప్పటికే నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు నగరపాలిక అధికారులు రూ.కోటి వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా సామాన్యునికి సంబంధించిన తాగునీటి సమస్య విషయం.
తిరుపతిలో ఉన్న 600కు పైగా నీటి శుద్ధి కేంద్రాలకు ఎటువంటి అనుమతులు లేవు. వీటి నిర్వాహకులు సంఘంగా ఏర్పడి అధికారికంగా నమోదు చేసుకున్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో నూతనంగా నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న వారు పెంచిన ధరలతో వ్యాపారం దెబ్బ తిని ధర తగ్గించారు. 

 పొంచి ఉన్న ముప్పు (చిత్తూరు)

సంఘం నిర్ణయించినట్లు సాధారణ శుద్ధి నీరు 20 లీటర్లు రూ.15, నాణ్యమైన శుద్ధి నీరు 20 లీటర్లు రూ.20కి విక్రయించాల్సిందే అని పట్టుబట్టి కొన్ని ప్రాంతాలలో ఆటోలను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ధరలు రెట్టింపు కావడంతో అసలు అంత సొమ్ము చెల్లించి నీరు కోనాల్సిన అవసరం ఏముందని ఆరా తీసే పనిలో పడ్డారు. నగర ప్రజల కోసం రెండు రోజులకోసారి గంట పాటు పంపిణీ చేసే తెలుగుగంగ నీటిని మోటార్లతో తోడి పరిసర ప్రాంతాల్లోని కుళాయిలకు రావాల్సిన నీటిని గుంజేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అదే నీటిని అశాస్త్రీయంగా శుద్ధి చేసి పరిసర ప్రాంతాల ప్రజలకు అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల తాగునీటి పైప్‌లైన్లు కూడా నీటి శుద్ధి కేంద్రాల వరకు విస్తరించి మిగిలిన ప్రాంతాలను వదిలేసినట్లు సమాచారం.
తిరుపతి నగరానికి ప్రధాన నీటి వనరులైన కైలాసగిరి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు, కల్యాణి డ్యామ్‌లలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. కైలాసగిరి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో ఉన్న నిల్వల్లో 40 రోజులకు మించి లభించే అవకాశం లేదు. ఇప్పట్లో కండలేరు నుంచి నీరు తోడుకునే అవకాశం తక్కువగా ఉంది. కల్యాణి డ్యామ్‌లో నీరు అడుగంటి పోతోంది. నిత్యం 10 ఎంఎల్‌డీలు రాబట్టగలిగినా నెలన్నర రోజుల వరకు నీరు లభించే అవకాశం ఉంది. వేసవి సమీపించే ఏప్రిల్‌ నాటిని నిల్వలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయి. క్లిష్ట పరిస్థితులే నీటి శుద్ధి కేంద్రాలకు వరం కానున్నాయి. నగరంలోని అన్ని నీటి శుద్ధి కేంద్రాల వివరాలను సేకరించి ట్రేడ్‌ లైసెన్స్‌లు ఇవ్వడం, వారి నియంత్రణ బాధ్యతలు నగరపాలిక ఆరోగ్య విభాగానికి గానీ, ఆహార కల్తీ నియంత్రణ అధికారులకు గాని, భూగర్భ నీటి సంరక్షణ విభాగపు అధికారులకు గాని అప్పగించి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

No comments:
Write comments