కాఫీకి తగ్గుతున్న డిమాండ్

 

విశాఖపట్టణం, మార్చి 9, (globelmedianews.com)
భారత దేశంలో కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనికి కారణం బ్రెజిల్‌లో ఈ పంట బాగా సాగు చేయడం, అక్కడి నుంచే ఇతర దేశాలకు సరఫరా చేస్తుండడంతో దేశీయంగా సాగవుతున్న కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్లు సంబంధిత అధికారవర్గాలు చెబుతున్నాయి. బ్రెజిల్ నుంచి సరఫరా అవుతున్న కాఫీతో ఆ ప్రభావం భారతదేశ కాఫీ విక్రయాలపై తీవ్రంగా పడుతోంది. అంతేకాకుండా మన దేశం నుంచి ఎగుమతి అయ్యే కాఫీ పంటకు క్రమేపీ డిమాండ్ పడిపోతోంది. బ్రెజిల్‌లో కాఫీ పంట సాధారణ స్థాయిలో పండినా, లేదంటే ప్రతి ఏడాది కంటే కూడా తగ్గిపోయిన సందర్భాల్లో మాత్రమే భారతదేశ కాఫీకి తగినరీతిలో డిమాండ్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మన దేశం నుంచి వెళ్ళే కాఫీకి గిట్టుబాటు ధర లభిస్తుందో, లేదో తెలియని పరిస్థితి. భారతదేశంలో ఎక్కువుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కాఫీని సాగు చేస్తారు. 


కాఫీకి తగ్గుతున్న డిమాండ్

ఆ తరువాతే ఏపీలోని విశాఖ జిల్లా ఏజెన్సీలో గిరిజన రైతులు, కాఫీ బోర్డు ఆధ్వర్యంలో కాఫీ తోటలు పెంచుతున్నారు. పదేళ్ళ ప్యాకేజీ కింద ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థ  సంయుక్తంగా గత మూడేళ్ళ నుంచి లక్ష్యాలను నిర్దేశించుకుని మరీ కాఫీ పంట దిగుబడిని పెంచగలుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడేళ్ల కిందట రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాదాపూ సాధించగలిగింది. గత ఏడాది మాత్రం కాఫీ పంట ఆశాజనకంగా లేకపోవడంతో కేవలం 400 మెట్రిక్ టన్నులతో సరిపెట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది 1500 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న జీసీసీ ఇప్పటికే 50 శాతానికి పైగా లక్ష్యాన్ని చేరింది. ఈ ఏడాది మే నెలాఖరు వరకు సీజన్ ఉన్నందున ఈ లోపు మిగిలిన లక్ష్యాలను పూర్తిచేసేందుకు సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అయితే కాఫీ విక్రయాల్లో ప్రపంచదేశాలను శాసిస్తున్న బ్రెజిల్ ఇపుడు అమెరికా, మెక్సికో వియత్నాం, కొలంబో, కెనడా, చైనా తదితర దేశాలకు కాఫీని విక్రయించాలని నిర్ణయించడంతో ఈ దేశం నుంచి ఎగుమతి అయ్యే కాఫీకి అంతగా డిమాండ్ ఉండదని జీసీసీ సంస్థ భావిస్తోంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కాఫీ పంట పడిపోయింది. ఒడిశా, ఏపీ, తెలంగాణా, తదితర రాష్ట్రాల నుంచి కనీస స్థాయిలో కూడా కాఫీ పంటను అందుబాటులోకి రావడంలేదు

No comments:
Write comments