చేదెక్కుతున్న చెరుకు

 

నిజామాబాద్, మార్చి 14, (globelmedianews.com)
చెరుకును సాగు చేస్తున్న రైతులు జీవితాలు చేదెక్కుతున్నాయి. సాగు నుంచి కోతల వరకు అనేక సమస్యలు. చెరుకు కోత, కూలీల కొరత రైతులకు, చక్కెర పరిశ్రమలకు ప్రధాన సమస్యలుగా మారాయి. మార్కెట ధరల వల్ల కూడా రైతులు, పరిశ్రమల నిర్వాహకులు ఢీలా పడుతున్నారు. సమస్యలు తాళలేక చక్కెర పరిశ్రమలు మూతపడుతుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. ఇప్పుడు ఉత్పత్తి చేసిన దాని కంటే రెట్టింపు చెరుకు ఉత్పత్తి చేసినా, క్రషింగ్ చే యగల పరిశ్రమలున్నా పక్క రాష్ట్రాల నుంచి చక్కెర దిగుమతి చేసుకునే దుస్థితి దాపురించింది. ఏళ్ల తరబడి లాభాల బాటలో నడిచిన చక్కెర పరిశ్రమలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 పరిశ్రమలున్నాయి. ఇందులోకి సహకార సంఘాల ద్వారా ఒకటి, ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త భాగస్వామ్యంలో మూడు, ఏడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. నిజామాబాద్ చక్కెర పరిశ్రమ సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచేది. అది ప్రస్తుతం మూతపడింది. నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ సంస్థతో ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న బోధన్, మెదక్, మెట్‌పల్లి చక్కెర పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. 


చేదెక్కుతున్న చెరుకు

ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో గణపతి షుగర్స్, ట్రైడెంట్ షుగర్స్, గాయత్రి షుగర్స్ కామారెడ్డి, గాయత్రి షుగర్స్ నిజాంసాగర్, కాకతీయ షుగర్స్, మధుకోన్ షుగర్స్, కృష్ణవేణి షుగర్స్‌లో ఉత్పత్తి జరుగుతుంది.  కాగా, రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండున్నర నుంచి మూడున్నర లక్షల టన్నుల చెరుకు దిగుబడి వచ్చేది. కానీ ఈ ఏడాది రెట్టింపు కంటే అధికంగా దిగుబడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గతంలో 25 వేల మంది రైతులు చెరుకు సాగుచేసేవారు. ఈ ఏడాది దాదాపు 30 వేల మంది రైతులు 30 వేల నుంచి 40 వేల హెక్టార్లలో చెరుకు సాగు చేశారని అధికారులు అంచనా. ఈ సంవత్సరం పండిన చెరుకు నుంచి రెండున్నర లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. రాష్ట్ర అవసరాలకు ఏడాదికి ఏడున్నర లక్షల చక్కెర అవసరం. అంటే దాదాపు ఐదు లక్షల టన్నుల లోటుంది. డిమాండ్‌కు ఉత్పత్తి చాలా అంతరం ఉంది.చెరుకు రైతులు, చక్కెర పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సవుస్యలు చెరుకు కోత, కూలీల కొరత. ఈ కారణంగానే ఖమ్మం, వనపర్తిలోని చక్కెర పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. కూలీలతో కాకుండా మిషనరీతో పనిచేయించవచ్చు కానీ ఒక చెరుకు కోత మిషన్ ను కొనుగోలు చేయడానికి రూ.1.20 కోట్ల నుంచి రూ.1.70 కోట్లు అవుతుంది. హార్వెస్టర్ కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదు. ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి రైతులు గానీ, పరిశ్రమల యాజమానులు గానీ హార్వెస్టర్ కొనే పరిస్థితి లేదు. ఒకవేళ సహకార సంఘాల ఆధ్వర్యంలో హార్వెస్టర్‌ను కొనుగోలు చేసినా దానిని నిర్వహణలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి చెరుకు హార్వెస్టింగ్‌కు సహాయం చేయాలని ప్రతిపాదనలు పంపామని, రూ.20 కోట్లు కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

No comments:
Write comments