కొడుకుల కోసం తల్లులు

 

హైద్రాబాద్, మార్చి 18, (globelmedianews.com)
కుమారులకు రాజకీయ జీవితం ఇవ్వడానికి తమ రాజకీయ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమవుతున్నారు తల్లులు. తెలంగాణలో కుమారుడి రాజకీయ జీవితం కోసం సబితా ఇంద్రారెడ్డి ఇంతకాలం ఉన్న పార్టీని వీడేందుకు సిద్ధపడగా ఆంధ్రప్రదేశ్ లో కుమారుడి కోసం తన నియోజకవర్గాన్ని వదులుకునేందుకు మంత్రి పరిటాల సునీత సిద్ధపడుతున్నారు. తల్లులపై కుమారులే ఒత్తిడి తెస్తున్నారో లేదా కుమారులను త్వరగా రాజకీయంగా మంచి స్థానంలో చూడాలనే తాపత్రయంతో వారే తొందరపడుతున్నారో కానీ ఇద్దరు మహిళా నాయకురాళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భర్త ఇంద్రారెడ్డి మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఆమె రాజకీయంగా మంచి స్థాయికి ఎదిగారు. 2004లో గనులశాఖ మంత్రిగా ఆమెకు అవకాశం రాగా 2009లో ఆమెకు కీలకమైన హోంశాఖ బాధ్యతలు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మహిళ హోంమంత్రిగా రికార్డుకెక్కారామె. ఇలా కాంగ్రెస్ పార్టీలోనే ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. 


కొడుకుల కోసం తల్లులు

2014లో పెద్ద కుమారుడు కార్తీక్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆమె భావించారు. అయితే ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని అధిష్ఠానం చెప్పడం ఆమె తాను పోటీ నుంచి తప్పుకొని కుమారుడికి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. కానీ కార్తీక్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఐదేళ్ల పాటు వీరి కుటుంబం నుంచి ఎవరూ చట్టసభల్లో లేరు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కార్తీక్ రెడ్డికి రాజేంద్రనగర్ టిక్కెట్ కావాలని కావాలని అడిగినా మళ్లీ ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధనను పార్టీ విధించింది. దీంతో కార్తీక్ కు దక్కలేదు. ఇక చేవెళ్ల ఎంపీ టిక్కెట్ కూడా ఆయనకు దక్కే అవకాశం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి చేరిన విశ్వేశ్వరరెడ్డికి టిక్కెట్ ఖరారైంది. దీంతో కుమారుడికి ఎంపీ టిక్కెట్ కోసం ఆమె తనకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు రాజకీయంగా ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోని ఆమె మొదటిసారిగా ఫిరాయింపు ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. కాంగ్రెస్ లో పదవులు అనుభవించి కష్టకాలంలో స్వార్థం కోసం టీఆర్ఎస్ లోకి వెళుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్ని విమర్శలకు కారణం కుమారుడిపై ఆమె ప్రేమే.ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రి పరిటాల సునీత ఆమె కుమారుడి కోసం తన సీటును త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. పరిటాల రవీంద్ర హత్య తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె ఇప్పుడు మంత్రిగానే ఉన్న నియోజకవర్గంలో మాత్రం ఆమె తనయుడు శ్రీరామ్ చక్రం తిప్పుతున్నారు. దీంతో ఆయనకు ఈసారి ఏదైనా టిక్కెట్ ఇవ్వాలని సునీత పార్టీని కోరారు. ఒకవేళ రెండు టిక్కెట్లు ఇవ్వడం కుదరకపోతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని, తన కుమారుడికి రాప్తాడు టిక్కెట్ ఇవ్వాలని ఆమె చంద్రబాబును కోరారు. ఒక్క టిక్కెట్ ఇవ్వాల్సి వస్తే ఇక పరిటాల సునీత రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి కుమారుల రాజకీయ భవిష్యత్ పై తల్లుల ఆరాటంతో వారే ఫ్యూచర్ ను ఫణంగా పెడుతున్నారు.

No comments:
Write comments