గాజువాక నుంచే జనసేనాని

 

విశాఖపట్టణం, మార్చి 18, (globelmedianews.com)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ అర్బన్ జిల్లా గాజువాక నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయిందంటున్నారు. అనీ తూచి మరీ జనసేనాని ఇక్కడ సీటు మీద కర్చీఫ్ వేశారని తెలుస్తోంది. గాజువాక పారిశ్రామికవాడ. 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం బోణీ కొట్టింది. ఆ పార్టీ తరఫున చింతలపూడి వెంకటరామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నాటికి టీడీపీలో ఆయన చేరిపోవడంతో టీడీపీకి అదనపు బలం చేకూరి విజయఢంకా మోగించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కే ఇక్కడ మరో మారు టికెట్ ఇచ్చారు. ఇక ఆయన గెలుపు ఖాయమని బరిలోకి దిగారు. మరో వైపు వైసీపీ తరఫున తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇపుడు జనసేన నుంచి పవర్ స్టార్ పోటీలో ఉంటే గాజువాక మీదనే అందరి కళ్ళూ ఉంటాయనడంలో సందేహమే లేదు.ఇక గాజువాకలో ప్రధానంగా కాపులు, యాదవులు బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. టీడీపీ కూడా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని యాదవులకు ఇక్కడ సీటు కేటాయించింది. 


 గాజువాక నుంచే జనసేనాని

టీడీపీలో వర్గ పోరు ఉంది కానీ చంద్రబాబు నచ్చచెప్పిన మీదట వారంతా కలసిపోయినట్లుగా బయటకు కనిపిస్తోంది. అయితే జనసేనాని కనుక రంగంలో ఉంటే టీడీపీలోని అసమ్మతి నేతలు, కాపులు కూడా జై కొట్టే పరిస్థితి ఉంటుందందంలో సందేహం లేదు. అలా కాపులు ఒకే వైపు వచ్చినపుడు మరో బలమైన యాదవులు కూడా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దాంతో పోటీ టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇక ఇప్పటివరకూ అక్కడ అభ్యర్ధిగా వైసీపీ తిప్పల  నాగిరెడ్డినే బరిలో ఉంచింది. ఆయన సైతం చాలా కాలంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎపుడైతే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారో అపుడు వైసీపీ కూడా గట్టి అభ్యర్ధినే ఇక్కడ ఎంపిక చేస్తుందని అంటున్నారు. తిప్పల నాగిరెడ్డి, పల్లా శ్రీనివాస్ మధ్యన నిన్నటి వరకూ పోటీ అనుకున్నారు. అపుడు టీడీపీలో అసమ్మతి ఆయనకు కలసి వస్తుందని కూడా ఊహించారు. ఇపుడు పవన్ కనుక రంగంలో ఉంటే అందుకు అనువైన వ్యూహాలను తమ పార్టీ రూపొందిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక గాజువాక పారిశ్రామిక వాడ కావడంతో పెద్ద ఎత్తున కార్మిక లోకం కూడా ఉంది. జనసేనతో పొత్తు కారణంగా వామపక్షాల మద్దతు కూడా పవన్ కి దక్కే అవకాశాలు ఉన్నాయి. అలా కార్మిక వర్గాల ఓట్లు కూడా చీలిపోయే చాన్స్ అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే పవన్ గాజువాకలో పోటీ చేయడం అంటే గెలుపునకు అవకాశాలు ఉన్న సీటు చూసుకునే మరీ దిగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి.

No comments:
Write comments