ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ పంచాయితీ

 

హైద్రాబాద్, మార్చి 14, (globelmedianews.com
కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా రెండు, మూడు రోజులు ఆలస్యమవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అభ్యర్థుల జాబితాను పట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఆ జాబితాపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం జరగలేదు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఆలస్యమవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 10న ప్రకటిస్తామని రాష్ట్ర నాయకులు చెప్పినా...15 లేదా 16 తేదీల్లో అభ్యర్థులు జాబితా విడుదల అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆశావాహులంతా ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీనేతలు బెల్లయ్యనాయక్‌, మధుయాష్కీగౌడ్‌, పటేల్‌ రమేష్‌రెడ్డి, సుభాశ్‌రెడ్డి, సతీష్‌ మాదిగ ఇతర ముఖ్యనాయకులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. మరో వైపు లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ల పర్వానికి తెరలేవనుండటంతో... అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. ఏప్రిల్ 11న జరగబోయే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ ఇప్పటికే కసరత్తును ముమ్మరం చేశాయి. 


ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ పంచాయితీ

సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిద్దరు మినహా అందరికీ టికెట్లు ఇస్తానని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ తరపున బరిలో ఎవరుంటారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సీనియర్లలో చాలామంది పోటీకి విముఖంగా ఉండటంతో... కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.అయితే తెలంగాణలో హైదరాబాద్ మినహా 16 సీట్లను గెలుచుకోవడంపై టీఆర్ఎస్ సీరియస్‌గా దృష్టి పెట్టడంతో... కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని టీపీసీసీకి చెందిన ఓ సీనియర్ నేత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా... బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితేనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పరువు దక్కుతుందని సదరు నేత తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. ఏయే స్థానం నుంచి ఎవరెవరిని బరిలో దింపాలనే దానిపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ జాబితాలోని పేర్లు ఈ విధంగా ఉన్నట్టు సమాచారం. 
మల్కాజ్‌గిరి- రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్- అంజన్‌కుమార్ యాదవ్, హైదరాబాద్- ఫిరోజ్ ఖాన్, జహీరాబాద్- షబ్బీర్ అలీ, మెదక్- సునీతా లక్ష్మారెడ్డి, వరంగల్- అద్దంకి దయాకర్
మహబూబ్ నగర్- డీకే అరుణ, నల్లగొండ- జానారెడ్డి, భువనగిరి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహబూబాబాద్- సీతక్క, ఖమ్మం- రేణుకా చౌదరి లేదా నామా నాగేశ్వరరావు, నిజామాబాద్- మధుయాష్కీ, పెద్దపల్లి- కె.సత్యనారాయణ, కరీంనగర్- జీవన్ రెడ్డి లేదా పొన్నం ప్రభాకర్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అదిలాబాద్- రమేశ్ రాథోడ్, 
నాగర్ కర్నూల్- సంపత్ 
అయితే ఈ జాబితాలో ఉన్న చాలామంది నేతలు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కచ్చితంగా ఆదేశిస్తే... వీరంతా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. మరి... టీఆర్ఎస్‌కు బలమైన పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను బరిలోకి దింపుతుందేమో చూడాలి. 

No comments:
Write comments