ప్రచారంలో బాబు దూకుడు

 

విజయవాడ, మార్చి 20, (globelmedianews.com)
చంద్రబాబు ఎన్నికల ప్రచార సరళిలో మార్పులు తెచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న చంద్రబాబు ఈసారి ఆయనపై విమర్శల్లో కొత్త కోణం ఆవిష్కరించారు. హైదరాబాద్ నిర్మించింది తానే నని తెలంగాణ ఎన్నికల్లో పదేపదే ప్రచారం చేసిన ఆయన తాజాగా కెసిఆర్ ను పైకి తీసుకువచ్చింది తానేనని అంటున్నారు. ఆయనకే అంత ఉంటే నాకెంత ఉండాలంటున్నారు. జగన్, మోడీ, కెసిఆర్ ఒక జట్టుగా ప్రతి సభలోను బాబు నొక్కి నొక్కి చెబుతూ ప్రత్యేకించి గులాబీ బాస్ పై తన గుస్సా చాటుతున్నారు.చంద్రబాబు గత మూడు నెలల్లో మూడు వేల తిట్లను తిట్టినట్లు కెసిఆర్ లెక్కించారు. తెలంగాణ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ తో జట్టు కట్టాలని ప్రయత్నం చేసి భంగపడిన బాబు ప్లేట్ ఫిరాయించి ఎదురుదాడికి దిగారని విమర్శల దాడి పెంచారు. 


ప్రచారంలో బాబు దూకుడు

పార్లమెంట్ ఎన్నికల్లోనూ సరైన ప్రత్యర్థి కనపడక కెసిఆర్ కూడా ఎపి చంద్రుడిని టార్గెట్ చేస్తూ తన ప్రచారంలో మసాలా జోడిస్తున్నారు. కేంద్రంలో చక్రం తిప్పేది తామేనని బాబు కాదని అంటూ సమరాన్ని వేడెక్కిస్తున్నారు. ఇలా ఇద్దరు చంద్రులు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతూ తమ సభల్లో ప్రజలకు రక్తి కట్టించడం విశేషం. మరో వైపు కర్నూలు జిల్లాలో జరిగిన ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులను పరిచయం చేసే క్రమంలో పాణ్యం నుంచి పోటీ చేస్తున్న గౌరు చరితను చంద్రబాబు పరిచయం చేస్తూ… ప్రతిపక్షంలో ఉన్నా చరిత ఎప్పుడూ గౌరవప్రదంగా ప్రవర్తించారని అన్నారు. తన కార్యక్రమాలకు సగం మంది ఎమ్మెల్యేలు రాలేదన్నారు. తాను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా గౌరు చరిత వచ్చి సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేవారని అన్నారు. అయితే, ఆమె ప్రతిపక్ష పార్టీలో ఉన్నందున ఆమె అడిగిన పనులు చేయలేదని, చేయనని కూడా చెప్పానని స్పష్టం చేశారు. ఆమె ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయడం సంతోషకరమన్నారు. గౌరు చరిత గత అసెంబ్లీలో వైసీపీ తరపున గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

No comments:
Write comments