అప్పుడే ప్రారంభమైన నీటి ఎద్దడి

 

ఖమ్మం, మార్చి 11,(globelmedianews.com)
వేసవి కాలానికి ముందుగానే ఉభయ జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఓవైపు సాగర్‌ జలాలు ప్రవహిస్తున్నా.. బావుల్లో నీటి ఊటలు కూడా పెరగడం లేదు. వరసగా మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అటు భద్రాద్రికొత్తగూడెంలోనూ జలమట్టాలు పాతాళానికి పడిపోయాయి. ఫిబ్రవరిలోనే 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారానికి అవి ఇంకా పెరిగాయి. మరో వారంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తుండటం భూగర్భ జలాలు వేగంగా తగ్గడానికి ప్రధాన కారణమవుతోంది. వాననీటి సంరక్షణ చర్యలను సక్రమంగా చేపట్టని ఫలితంగా ఇకముందు నీటి ఎద్దడి తీవ్రతరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పంటలకు సాగునీటి గండం ఏర్పడే అవకాశం ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలన్నీ చేతికి రావాలంటే ఏప్రిల్‌ చివరి వరకు సాగునీరు అవసరం ఉండటంతో పంటను కాపాడుకోవాలని రైతులు ఆరాటపడుతున్నారు. రెండు నెలల నుంచి ప్రభుత్వం సాగుకు 24 గంటల విద్యుత్తును అందిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు అధికంగా నీటిని వినియోగిస్తున్నారు. 


అప్పుడే ప్రారంభమైన నీటి ఎద్దడి

మిరప, మొక్కజొన్న, వరి పంటలను ఎక్కువగా సాగుచేయగా వాటికి నీటి  తడులు అధికంగా ఇస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా మార్చి మాసాంతానికి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితి వల్ల పంటలకు నీటి తడులు అధికంగా అవసరం ఉంటుంది. ఇప్పుడున్న పంటలన్నీ రైతు ఇంటికి చేరాలంటే కనీసం ఏప్రిల్‌ చివరి వరకు సమయం పడుతుంది. నిరంతర విద్యుత్తు కారణంగా రైతుల్లో నిర్లక్ష్యం పెరిగింది. పంటలకు నీరు పెట్టి ఇతర పనుల్లో నిమగ్నకావడం వల్ల అధికంగా సాగునీరు వృథాగా పోతుంది. గతంలో ఒక్క ఎకరానికి రెండు రోజుల్లో నీరుపెడితే ఇప్పుడు అదే ఎకరానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనికి ప్రధాన కారణం రైతులు విద్యుత్తు నిరంతరం విద్యుత్తు ఉండటంతో బోర్ల నుంచి అధికంగా నీటిని తోడుతున్నారు.ఖమ్మం, భధ్రాద్రి రెండు జిల్లాల్లోనూ బోర్లకింద సాగు విస్తీర్ణమే అధికంగా ఉంటుంది. ఖమ్మం అర్బన్‌, సింగరేణి, కామేపల్లి, కొణిజర్ల, జూలూరుపాడు, అశ్వారావుపేట, బోనకల్లు, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌, రఘునాథపాలెం, పెనుబల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, చంద్రుగొండ ప్రాంతాల్లో బోర్లు అధికంగా ఉన్నాయి. ఉభయ జిల్లాల్లో గత నెల నాటికి సరాసరిన 0.60 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాలం కలసిరాకపోవడంతో ఈ రబీలో బోర్ల కింద 18144 హెక్టార్లలో వరి, 8733 హెక్టార్లలో మొక్కజొన్న, 567 హెక్టార్లలో పెసర మాత్రమే సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం సాగయ్యింది సగానికి తక్కువే. వీటితో పాటు మిర్చి బోర్లు, బావుల కింద అధికంగానే సాగులో ఉండటంతో నీటి అవసరం పెరిగింది. ఉభయ జిల్లాల్లో 1,26,693 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా.. ఇందులో అధికశాతం బోర్లు, బావులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భూగర్భ జలమట్టాన్ని అంచనా వేస్తూ సాగునీటిని పొదుపుగా వాడుకుంటునే రబీ పంటలను సాగునీటి గండం నుంచి గట్టెక్కించవచ్చు. గతంలో బోరులో నుంచి నీరు అధికంగా వచ్చేదని, ప్రస్తుతం సగానికి సగం తగ్గిందని మల్లుపల్లికి చెందిన నాగులు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మిర్చి, మొక్కజొన్న పంటలను సాగుచేశామని నీరు అధికంగా అవసరముందని పేర్కొన్నాడు. రెండు ఇంచుల వచ్చే నీరు ఇప్పుడు ఒక ఇంచు మాత్రమే బోరు నుంచి వస్తుందని తెలిపాడు. 

No comments:
Write comments