జైళ్లలో ఖైదీలే రేడియో జాకీలు

 

హైద్రాబాద్, మార్చి 12, (globelmedianews.com)
జైళ్లలో ఖైదీలకు వినోదం అందించడానికి తెలంగాణ జైళ్ల శాఖ సరికొత్త ముందడుగేసింది. ఖైదీల కోసం ప్రత్యేక ఎఫ్‌ఎం రేడియోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో.. ఇది జైలు రేడియో గురూ అంటూ ఎఫ్‌ఎం కార్యక్రమాలు సందడి చేయనున్నాయి. ఖైదీలు ఎఫ్‌ఎం రేడియోను విననున్నారు. ఈ తరహా తొలి ఎఫ్ఎం రేడియోను అధికారులు చంచల్‌గూడ జైల్లో  ప్రారంభించారు.ఖైదీలతోనే ఈ ఎఫ్‌ఎం రేడియోను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 


జైళ్లలో ఖైదీలే రేడియో జాకీలు 

వినోదంతో పాటు ఖైదీలకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఈ ఎఫ్‌ఎం రేడియో ప్రారంభించినట్లు జైళ్ల పర్యవేక్షణాధికారి అర్జున్‌ రావు తెలిపారు. ఖైదీలు తమ తమ బ్యారక్‌లలోనే రేడియో వినేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఖైదీలకు కావాల్సిన పెరోల్‌, ఫర్లో, ములాఖత్‌ విషయాతో పాటు వారికి జైలు అధికారులు అందించే రెమిషన్‌ లాంటి అదనపు సమాచారాన్ని అందించేందుకు ఈ ఎఫ్ఎం రేడియో సేవలను వినియోగించే అవకాశాలున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎఫ్ఎం రేడియో సేవలను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

No comments:
Write comments