ఫిరాయింపులతో పార్టీలకు తలనొప్పులు

 

విజయవాడ, మార్చి 19, (globelmedianews.com)
తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు రెంటికీ ఫిరాయింపుల బెడద తీవ్రమవుతోంది. ఎన్నికల ముహూర్తం ఖరారైన తర్వాత తమకు టిక్కెట్లు కావాలని డిమాండు చేసేవారు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధినాయకత్వాలనే బెదిరిస్తున్నారు. తాము లేకుండా ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. టిక్కెట్ల కేటాయింపు చివరిదశకు చేరిన తరుణంలో అటోఇటో అని నాయకులు అన్నిటికీ సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. త్రిముఖ పోటీ నెలకొన్న స్థితిలో జనసేనకు ఈ బెడద తక్కువగానే ఉంది. టీడీపీ, వైసీపీ మాత్రం అసమ్మతి సెగలు ఎదుర్కొంటున్నాయి. సహజంగానే అధికారపార్టీపై అలకబూనేవారే అధికంగా కనిపిస్తున్నారు. గతంలోనే కొంచెం అటుఇటుగా ఆలోచించేవారు వైసీపీని వీడివెళ్లిపోయారు. దాంతో ఇప్పుడు అధినేతకుసీట్ల కేటాయింపులో కొంత సౌలభ్యం ఏర్పడింది. టీడీపీకి మాత్రం తలపోటు పెరిగింది. ప్రతిపక్షం నుంచి వచ్చిన తమకు ఈ ఎన్నికల్లో సముచిత స్థానం ఇవ్వకపోతే ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించే వారి సంఖ్య బాగా పెరిగింది. వలసలు ఎన్నికల సీజన్ లో కామన్ అయినప్పటికీ ఈసారి ప్రచార పర్వం వరకూ జోరు కొనసాగబోతోంది.ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే వ్యూహంతో తెలుగుదేశం తొలుత పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించింది. 


ఫిరాయింపులతో పార్టీలకు తలనొప్పులు


ఎమ్మెల్యేలు, వైసీపీలోని పెద్ద నాయకులు క్యూ కట్టి వచ్చి టీడీపీలో చేరిపోయారు. వారందరికీ ప్రభుత్వం వివిధ రకాల ప్రయోజనాలు సమకూరుస్తూ వచ్చింది. అయితే అందరి లక్ష్యమూ తిరిగి ఎన్నికల్లో టిక్కెట్లు తెచ్చుకోవడమే. శాసనసభ లో సీట్ల సంఖ్య 225 వరకూ పెరుగుతుంది. అదనంగా పార్టీలోకి వచ్చిన పెద్ద నాయకులకు టిక్కెట్లు ఇచ్చేందుకు ఇబ్బంది ఉండదనుకున్న టీడీపీ ప్లాన్ ప్రస్తుతం వికటిస్తోంది. సర్దుబాటు చేయడం కష్టమవుతోంది. 126 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఎంపిక చేస్తే ప్రతి నియోజకవర్గంలోనూ అసమ్మతి గళాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చి టిక్కెట్టు రాని వారి బెదిరింపులు పెరిగిపోయాయి. పార్టీ క్రమశిక్షణకు అలవాటు పడిన పాతకాపులు సైతం తమకు అన్యాయం జరుగుతోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈసారి టీడీపీకి ఎన్నికల ప్రచారం కంటే వీరిని బుజ్జగించడమే పెద్ద సవాల్ గా మారుతోంది. అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకున్నట్లుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలుగుదేశంపై సైకలాజికల్ ఇంపాక్టు పడే విధంగా ప్రతిపక్షం వైపు కదలికలు కనిపించడం ఆందోళనకు తెరతీస్తోంది.ప్రజల నాడిని కనిపెట్టడంలో రాజకీయనాయకులను మించినవారు ఉండరు. పైకి ఏమిచెప్పినప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందన్న అంశాన్ని నాయకులు చక్కగా పసిగట్టగలుగుతారు. తమకు ఏ పార్టీలో అయితే మంచి భవిష్యత్తు ఉంటుందో వారికి ముందే తెలిసిపోతుంది. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం ఉండటంతో నాయకుల డిమాండ్లు పెరిగిపోయాయి. ఇక్కడ కాకపోతే ఆ పార్టీలోకి పోతామంటూ బహిరంగంగానే చెబుతున్నారు. మనసు ఒకచోట మనువు మరొక చోట అన్నట్లుగా కొనసాగిన కొందరు నేతలు సొంత పార్టీల వైపు పావులు కదుపుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొందరు ఎంపీలు, నాయకులు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారు. నిజానికి వారికి అక్కడ గతంలో మాదిరిగా మంచి స్థానం దక్కుతుందనే గ్యారంటీ లేదు. అయితే అధికారపార్టీపై ప్రతీకారంతోనే వారు పాత పార్టీకి వెళుతున్నారు. వారికి వ్యక్తిగతంగా పెద్దగా ప్రయోజనం లేకపోయినప్పటికీ ప్రతిపక్షానికి మాత్రం ఇది బాగా కలిసొస్తోంది. తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు చేయలేని ప్రాంతాల్లో నాయకులకు వైసీపీ వల వేస్తోంది. వారందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపీట వేస్తామంటూ భరోసానిస్తోంది.వివిధ రకాల సర్వేలు, ప్రజలనుంచి వాయిస్ రెస్పాన్స్ తో అభ్యర్థులను ఎంపిక చేశామంటూ టీడీపీ అధినేత చేస్తున్న ప్రకటన పట్ల క్యాడర్ గుర్రుగా ఉంది. వివిధ రకాల సమీకరణలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు. చేస్తున్నారు. ఇందులో కొంత ఒత్తిడి కూడా పనిచేస్తోంది. అయితే అభ్యర్థుల మార్పు జరిగిన చోట్ల ఆ నెపాన్ని ఇంట్రా వాయిస్ రెస్పాన్స్ సిస్టం పేరిట పార్టీ శ్రేణులు, ప్రజలపై తోసేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. అవసరము, అవకాశం, అభ్యర్థులు, పార్టీలను నిర్దేశిస్తోంది.వివిధ రూపాల్లో ప్రభుత్వం తో కాంట్రాక్టులు నడిపే ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆకర్షించింది. తమ అవసరం కోసం వారు ఇంతకాలం పార్టీలో కొనసాగారు. బిల్లులు, కొత్త కాంట్రాక్టులు పొందారు. ఈ వాపును బలంగా తెలుగుదేశం పార్టీ చూపించేందుకు ప్రయత్నించింది. అవసరం తీరిపోవడంతో మళ్లీ కాంట్రాక్టు ప్రజాప్రతినిధులు అవకాశం కోసం కొత్త పార్టీని వెదుక్కుంటున్నారు. అందులోనూ కొందరు కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధులను పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఆకర్షించి వైసీపీ వైపు మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండా అవకాశ వాదంతోనే పార్టీలు, అభ్యర్థులు కూడా వ్యవహరిస్తూ ఉండటం స్పష్టమవుతోంది. ఈ ఎత్తు పైఎత్తుల చదరంగంలో ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోతూనే ఉంది.

No comments:
Write comments