కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్న ఎమ్మేల్యే రాజీనామా

 

బెంగళూర్ , మార్చి 7, (globelmedianews.com)
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. అయితే ఈ విషయంలో కొంత వ్యూహంతో వ్యవహరించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీ అగ్రనేతలకు సూచించారు. ఉమేష్ జాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బాటలో మరికొందరు ఉన్నారు. ఇటీవల ఉమేష్ జాదవ్ తో పాటు రమేష్ జార్ఖిహోళి, బి.నాగేంద్ర, మహేష్ కుముటళ్లి వంటి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ శిబిరంలోకి వెళ్లి వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనడంతో కొంత వెనక్కు తగ్గారు.ఇప్పుడు తాజాగా ఉమేష్ జాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మిగిలిన ముగ్గురు కూడా అదే బాట పడతారన్న ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇందుకు సిద్ధరామయ్య పార్టీ నేతలతో చర్చించారు. ఈ నలుగురి మీద అనర్హత వేటు వేయాలని ఇదివరకే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ను కోరింది. 


కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్న ఎమ్మేల్యే రాజీనామా

అది ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే ప్రస్తుతం ఉమేష్ జాదవ్ ఇచ్చిన రాజీనామాను ఆమోదించకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి కుమారస్వామి ఆలోచన.అసంతృప్త నేతలు కొంత వరకూ వెనక్కు తగ్గుతారన్నది వారి వ్యూహం. ఉమేష్ జాదవ్ రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించకపోవడంతో గతంలో తాము ఇచ్చిన అనర్హతవేటు అంశాన్ని బయటకు తీయాలని సిద్ధూ ఆలోచిస్తున్నారు. మిగిలిన ముగ్గురి విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్న సంకేతాలను బలంగా పంపగలిగితే కొంత వరకూ అసంతృప్తులు వెనక్కు తగ్గుతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఉమేష్ జాదవ్ పార్టీని వీడి మోసం చేశారని ఇప్పటికే పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోతే… ఇక సంకీర్ణ సర్కార్ మెజారిటీకి అంచున ఉంటుంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే మరికొంత మంది అసంతృప్తులు బయటకు వస్తారని కాంగ్రెస్ నేతలు భయపడిపోతున్నారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏమాత్రం తోక జాడించినా సంకీర్ణ సర్కార్ పని అయిపోయినట్లే. అందుకే మరికొంతమంది పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని, వారికున్న అసంతృప్తులను తొలగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. మంత్రి పదవులు తప్ప మిగిలిన అన్ని పనులూ చేసి పెట్టేందుకు రెడీ ఉన్నామన్న సంకేతాలను అసంతృప్తులకు పంపే పనిలో పడింది కాంగ్రెస్.

No comments:
Write comments