కొవ్వూరు నేతలకు స్థానికేతరులకేనా

 

ఏలూరు, మార్చి 18, (globelmedianews.com)
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు ఎవ్వరి ఊహలకు అందని విధంగా మారుతున్నాయి. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్సైజ్‌ శాఖా మంత్రి కేఎస్‌ జవహర్‌ను మార్చాలని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు గత రెండేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశాయి. 2014లో అప్పటి వరకు ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్న జవహర్‌ అనూహ్యంగా టీడీపీ సీటు దక్కించుకుని విజయం సాధించారు. 2017లో జరిగిన కేబినెట్‌ ప్రక్షాళన‌లో చంద్రబాబు ఆయనకు కీలకమైన ఎక్సైజ్‌ శాఖా మంత్రి బాధ్యతలను కట్టపెట్టారు. ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు బాగానే ఉన్నా మంత్రి అయ్యాక నియోజకవర్గంలో నియోజకవర్గ టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జవహర్‌ ఓ వర్గానికి కొమ్ము కాయడంతో మరో వర్గం ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. రెండేళ్ల పాటు ఎన్నో పోరాటాల తర్వాత కొవ్వూరు టీడీపీ శ్రేణులు సక్సెస్‌ అయ్యాయి. స్థానికేత‌రుడు అయిన జవహర్‌ను చంద్రబాబు చివరకు అక్కడ పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన వ్యతిరేకతకు తలొగ్గి ఆయన తన సొంత జిల్లా కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు.తాజా జాబితాలో జవహర్‌కు తిరువూరు అభ్యర్థిత్వం ఖరారు అయ్యింది. 


కొవ్వూరు నేతలకు స్థానికేతరులకేనా

జవహర్‌ స్వగ్రామం ఇదే నియోజకవర్గంలోని గానుగపాడు. జవహర్‌ను వదిలించుకున్నామని ఊపిరి పీల్చుకున్న కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు మళ్ళీ అదిరిపోయే షాక్‌ తగిలింది. ఈ సారి మళ్ళీ స్థానికేతురురాలు అయిన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను రంగంలోకి దింపారు. జవహర్‌లాగా అనిత కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయారంగ్రేటం చేశారు. గత ఎన్నికల్లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి తొలి సారి పోటీ చేసిన ఆమె సీనియర్‌ రాజకీయ వేత్త చెంగ‌ల వెంకట్రావును ఓడించారు. నియోజకవర్గానికి స్థానికేతరుడు అయిన జవహర్‌ను వదిలించుకుంటే మరో స్థానికేతురాలు అయిన అనితను బలవంతంగా మా మీద రుద్దడం ఏంటా అని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. టీడీపీ కంచుకోట అయిన కొవ్వూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ స్థానికేతురులను ఎంపిక చెయ్యడం ఏ మాత్రం సమంజసంగా లేదని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. మొన్నటి వరకు జవహర్‌ను వ్యతిరేకించిన వారు ఇప్పుడు అనిత వద్దంటూ నిరసనలు చేపట్టబోతున్నారు.విచిత్రం ఏంటంటే నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అచ్చిబాబు స్థానికులకే సీటు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం ఐదుగురు పేర్లు సూచించారని తెలిసింది. అయితే అందుకు భిన్నంగా అధిష్టానం మాత్రం స్థానికేత‌రురాలు, పాయకరావుపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ వ్యతిరేకతను ఎదురుకుంటున్న అనితను కొవ్వూరుకు ఎంపిక చేసింది. దీనిపై అచ్చిబాబు వర్గం గుంభనంగా ఉంది. వాస్తవంగా చూస్తే అనితకు పాయకరావుపేటలో గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అక్కడ సీనియర్‌ నేతలు సైతం అమె తీరుకు నిరసనగా పార్టీకి దూరం అయ్యారు. అయితే అనితను కొవ్వూరు అభ్యర్థిగా ఎంపిక చెయ్యడంతో జవహర్‌ను నిన్నటి వరకు నియోజకవర్గంలో సమర్థించిన వారంతా ఇప్పుడు సంబ‌రాలు చేసుకుంటున్నారు.జవహర్‌ను వద్దనందుకు తగిన శాస్తి జరిగిందని వారు చెబుతున్నారు. ఇక అనితకు కొవ్వూరు సీటు ఇవ్వడం వెనక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. జవహర్‌ను మార్చాలని ఇక్కడ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సూచించగా తాము జవహర్‌ను ఇక్కడ కొనసాగిస్తాం, అయితే ఇక్కడ సీటు మార్చాల్సి వస్తే తాము సూచించిన అభ్యర్థికే మీరంతా పని చెయ్యాల్సి ఉంటుందని వారు ఖ‌రాకండీగా చెప్పి అనితకు ఇక్కడ సీటు ఇచ్చినట్టు తెలిసింది. ఇక 1983 నుంచి 2014 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఒక్క 1999లో మినహా అన్ని సార్లు టీడీపీ ఘన విజయం సాధించింది. ఇలాంటి కంచుకోటలో ఈ సారి అయినా తమకు స్థానికుడు ఎమ్మెల్యేగా అవుతాడని భావించిన నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో చాలా మందికి అనితకు సీటు ఇవ్వడం రుచించడం లేదు. అయితే స్థానికుడికి సీటు ఇవ్వాలని పట్టుబట్టిన అచ్చిబాబుకు తెలిసే ఇదంతా జరిగిందా ? లేదా ఆయనకు ఏదోలా నచ్చచెప్ప వచ్చని చంద్రబాబు భావించారా ? అన్నది మాత్రం అంతుపట్టడం లేదు. ఏదేమైనా కృష్ణాజిల్లాకు చెందిన జవహర్‌ను బలవంతంగా ఆ జిల్లాలోని తిరువూరుకు పంపించిన కొవ్వూరు టీడీపీ శ్రేణులు మరో దిగుమతి సరుకు అయిన అనితకు ఇప్పుడు తప్పని సరిగా సపోర్ట్‌ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నిన్నటి వరకు జవహర్‌కు అనుకూలంగా ఉన్న వారు ఇప్పుడు అనిత విషయంలో ఏం చేస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది

No comments:
Write comments