తెలంగాణలో భారీగా పెరిగిన చిరుతలు

 

మంచిర్యాల, మార్చి 14, (globelmedianews.com)
వేసవి ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో దాహార్తి కోసం పెద్దపులులు, చిరుత పులులు సంచరిస్తూ అటవీ శాఖ సిసి ఫుటేజీల్లో కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, కవ్వాల్ అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనాకు వస్తున్నారు. ఆదిలాబాద్ అటవీ డివిజన్ పరిధిలో చిరుతపులి సంచరిస్తున్నట్టు సిసి పుటేజీలో కెమెరాకు చిక్కడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోని ఆగిలాబాద్, బేల, ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలో చిరుతల సంచారం కనిపిస్తుండగా మరోవైపు ఇచ్చోడ డివిజన్ పరిధిలోని బోథ్, ఉట్నూరు ప్రాంతాల్లో ఓ చిరుతపులి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల తాంసి, తలమడుగు, బోథ్ మండలాల్లో చిరుత పులి సంచరిస్తూ మేతకు వెళ్ళిన పశువులను చంపి తిన్న సంఘటనల ఆధారంగా జంతు గణనలో చిరుత పులులు ఉన్నట్టు గుర్తించారు. మాంసాహార జంతు గణన చేపట్టగా కవ్వాల్‌లో రెండు, కాగజ్‌నగర్‌లో ఆరు పులులు ఉన్నట్టు బయటపడ్డాయి. కోటపల్లిలో గతంలో ఒక పులిని వేటగాళ్ళు హతమార్చగా, బెజ్జూర్ ప్రాంతంలో వేటగాళ్ళ ఉచ్చుకు తగిలి గాయాలతో తప్పించుకున్నట్టు గుర్తించారు. పులి చర్మం, పులి అడుగులు, మలం ఆధారంగా పులుల సంఖ్యను వైల్డ్ లైఫ్ శాఖ గుర్తించి లెక్కించి పూర్తి నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. 


తెలంగాణలో భారీగా పెరిగిన చిరుతలు

గత జనవరి చివరి మాసంలో చిరుతపులుల గణన చేపట్టగా నాలుగు చిరుత పులులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.అయితే నెల రోజుల పరిధిలో ఆదిలాబాద్ డివిజన్‌లో మరో చిరుత, కవ్వాల్ ప్రాంతంలో ఇంకో చిరుత అడుగుజాడలు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అడవుల్లో సంచరించే సిబ్బంది, వంటచెరకు కోసం అడవులకు వెళ్ళే కార్మికులు, పంట పొలాల్లోకి వెళ్లే రైతులు చిరుత ఆనవాళ్ళను చూసి భయపడుతున్నారు. స్మగ్లర్లు మాత్రం యధేచ్ఛగా ఆయుధాలతో వెళ్ళి అటవీ సంపదను కొల్లగొడుతున్నట్టు తెలుస్తోంది. ఇచ్చోడ అటవీ రేంజ్ పరిధిలోనే ఇటీవల సుమారు 50 లక్షల విలువైన అక్రమ కలపను రవాణా చేస్తుండగా పట్టుకొని స్వాధీనపర్చుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడానికి అధికారులు జంకుతుండడం గమనార్హం. స్మగ్లర్ల వద్ద ఆయుధాలు ఉండడంతో అడవుల్లోకి నిర్భయంగా వెళ్తున్నారని, అటవీ సిబ్బందికి, అధికారులకు ఆయుధాలు లేకపోవడంతో అటవీ సంరక్షణతో పాటు స్మగ్లర్లను కట్టడి చేయడం కష్టసాధ్యంగా మారుతుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని మావల నర్సరీకి దగ్గరలో అటవీ శాఖ చేపట్టిన కందకాల తవ్వకాల పక్కనే ఓ చెట్టుకు బిగించిన సిసి కెమెరాలో దృఢంగా ఉన్న చిరుతపులి సంచరిస్తున్న ఆనవాళ్ళు కనిపించడంతో అధికారులు ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఏది ఏమైనా చిరుత పులులు, పెద్ద పులుల సంఖ్య పెరుగుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి

No comments:
Write comments