పసుపు, ఎర్ర జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి -

 

 ప్రభుత్వం వెంటనే  పసుపు బోర్డ్  ఏర్పాటు చేయాలి
 భూ - రికార్డులలో తప్పులకు రెవెన్యూ అధికారులే బాధ్యులు
జగిత్యాల మార్చి 11 (globelmedianews.copm)  
రెవెన్యూ అధికారుల స్వార్థం, నిర్లక్ష్యం, అవినీతి వల్లనే భూ రికార్డులలో అనేక తప్పులు దొర్లాయని, అధికారుల తప్పిదాలే రైతుల పాలిట శాపంగా మారి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అర్హులైన నిరుపేద రైతులకు అందకుండా పోతున్నాయని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ఆరోపించారు.
తెలంగాణ జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రో.కోదండరాం పిలుపు మేరకు సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ బి.రాజేశం కు విజ్ఞాపన పత్రం అందజేసి  రాష్ట్ర , జిల్లా వ్యాప్తంగా నెలకొన్న రైతు సమస్యలు తీర్చాలని , ప్రభుత్వం వెంటనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని,  పసుపు పంటకు క్వింటాల్ కు రూ. 15,000,   ఎర్ర జొన్నలకు క్వింటాలు కు రూ.3,500 చొప్పున, ఇతరత్రా పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు జరిగేలా ప్రభ్యత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఆనంతరం ఈ సందర్బంగా తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి  మాట్లాడుతూ నెలల తరబడి రైతులు ఇంకా కూడా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ , అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారని, భూ రికార్డులలో దొర్లిన తప్పిదాలకు రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలని , అవినీతి మత్తులో కూరుకుపోయిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యము వల్లనే నిరుపేద రైతులు రాష్ట్ర ప్రభుత్వ   రైతు బంధు పథకం గాని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ది పొందలేకపోవడంతో పాటు రైతు భీమాను కూడా కోల్పోతున్నారని, దీనికి ప్రభుత్వ ఉన్నతాధికారులే బాధ్యత వహించాలని ఆయన మండిపడ్డారు. 


పసుపు, ఎర్ర జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి -

వెంటనే ప్రభుత్వం క్వింటాలుకు రూ.3,500 చొప్పున ఎర్రజొన్నలు కొని రైతులను ఆదుకోవాలని,,  పసుపు క్వింటాలుకు రూ. 15,000 ధరను స్థిరీకరించే విదంగా ప్రభుత్వమే తప్పని సరిగా చర్యలు  తీసుకోవాలని, ప్రభుత్వం  వెంటనే పూనుకొని  పసుపు బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.  ఎర్ర జొన్నల వ్యాపారుల ఆగడాలను నివారించడానికి మార్కెటు చట్టంలోని సెక్షన్ 11  ను పటిష్టంగా అమలు చేయాలని, .కేంద్రం సూచించిన విదంగా కాంట్రాక్టు వ్యవసాయంలో వున్న రైతుల రక్షణకు ప్రత్యేక సంస్థను ఏర్పరచాలని చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు.  రైతుల పైన పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేసి, అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని, ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే తెరిచి ప్రారంభించాలని,  ఏండ్ల తరబడి పెండింగులో ఉన్న  ముత్యంపేట చక్కెర కర్మాగారం రైతు బకాయిలను, కార్మికుల పెండింగ్ జీతాలను ప్రభుత్వమే చొరవ తీసుకొని  వెంటనే చెల్లింపజేయాలన్నారు.
శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు నీటిని  ఇతర ప్రాంతాలకు తరలించకుండా ఈ ప్రాంత రైతులకే చివరి ఆయకట్టు వరకు రెండు పంటలకు నీరందేలా చర్యలు చేపట్టాలని
 వ్యవసాయ సబ్సీడీ రుణాలు, యంత్రాలు, ట్రాక్టర్లు దళారులకు, రాజకీయ నాయకులకు, బినామీలకు  కాకుండా  వ్యవసాయం  చేసే అర్హులైన రైతులకే అందేలా  కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలలో దొర్లిన భూ రికార్డుల తప్పులు - ఇతరత్రా  భూ సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించి రైతులను ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ  రైతు బంధు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ది కూడా భూ సమస్యలు ఎదుర్కొన్న రైతు లందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని
  భూ సమస్యలు ఎదుర్కొన్న  రైతులందరికి కూడా పంట రుణాలు అందేలా , ప్రభుత్వ రుణ మాఫీ వర్తించేలా  చూడాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్   జిల్లాలలో పసుపు,  ఎర్ర జొన్న  ప్రధాన వాణిజ్య పంటలు.  ఈ పంటలను న్యాయమైన ధర చెల్లించి కొనగల మార్కెట్ వ్యవస్థ లేదన్నారు.  పసుపు శుద్ధికి, అమ్మకానికి నిజామాబాద్ లో  కానీ, ఇతర జిల్లాలలో కానీ కావలసిన సౌకర్యాలు లేవని,  రైతులు పంటను ప్రదానంగా మహారాష్ట్రకు వెళ్ళి అమ్ముకుంటారు.  పసుపు బోర్డు ఏర్పడితే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించారు.  కానీ అదీ రాలేదని గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
   ఇక ఎర్ర జొన్న మార్కెటు గుప్పెడు మంది వ్యాపారస్తుల చేతుల్లో వున్నదని,  వారు విత్తనాలను ఇచ్చి పంటను కొంటారని, ఈ వ్యాపారస్తులే మార్కెటును శాసిస్తున్నారని, .  వాస్తవానికి మార్కెటు చట్టం సెక్షన్ 11  ప్రకారం వ్యాపారస్తులు వ్యవసాయ మార్కెట్లలో నమోదు చేసుకోవాలన్నారు  నమోదైన వ్యాపారస్తులు రైతులతో ఒప్పందం చేసుకొని దాని ప్రకారం మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని,   ఈ చట్టం అమలుకు నోచుకోవడం లేదని,   ప్రభుత్వ నియంత్రణ లేకపోయేసరికి మార్కెట్ల పైన వ్యాపారస్తుల  పెత్తనం బలపడిందన్నారు.   రైతులు అన్యాయానికి గురవుతున్నారని,  గత పదేళ్లుగా రైతులు న్యాయమైన ధరల కోసం ప్రతీ ఏడూ రోడ్లపైకి వస్తున్నారని,
రైతుల పోరాటాలకు ఫలితం లభించడం లేదని,  దేశానికి రైతులే వెన్నెముక - రైతు లేనిదే రాజ్యం లేదు. మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం పైననే ఆధారపడ్డ ప్రాంతం.   ఈ నేపద్యంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఏర్పడు తున్నదని ఆయన సూచించారు.
ఈ దోపిడీ నేపద్యంలో ఈ సారి కూడా రైతులు గిట్టుబాటు ధర కొరకు  ఆందోళన చేస్తున్నారని,  రైతులమైన మేము  మార్కెటు ధరల ప్రకారం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొంటున్నాం కదా ,   అదే విదంగా మా పంటను కూడా  మేము నిర్ణయించిన ధరకు ఎందుకు కొనరని రైతులు అడుగుతున్నారని,  మార్కెట్లు సామజిక పరిస్థితులకు అతీతంగా వుండవని, బలమైన శక్తులు మార్కెటును నియంత్రిస్తుంటే  - బలహీనమైన రైతులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు.     అలాగే మన జగిత్యాల జిల్లాలోని దాదాపు ప్రతి గ్రామంలో భూ - రికార్డుల సమస్యలు ఇంకా కూడా పరిష్కారం కావడం లేదని,, పాత రికార్డులకు - కొత్త రికార్డులకు పొంతన లేక అనేక గ్రామాలలో రైతులు నేటికీ కూడా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారని ఆరోపించారు. నిత్యం మండల రెవెన్యూ  కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆర్థికంగా కూడా చాలా మంది రైతులు నష్టపోతూ భూ - తగాదాలకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "రైతు బంధు "   పథకానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన "ప్రధాన మంత్రి  కిసాన్ సమ్మాన్ నిధి "  లబ్దికి నోచుకోకపోవడమే గాక బ్యాంకుల  ద్వారా పంట రుణాలు కూడా పొందలేక రైతులు తీవ్రంగా  నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:
Write comments