మూడు జిల్లాలకు తాగు నీటి కష్టాలు

 

అడుగంటిపోయిన ఎస్సార్సెపీ నిల్వలు
నిజామాబాద్, మార్చి 5, (globelmedianews.com)
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు తాగు, సాగు నీటి ముప్పు పొంచి ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు.. నిజామాబాద్‌ జిల్లా తాగు, సాగు అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టులో 17 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 0892టీఎంసీల నీళ్లే ఉన్నాయి. కనీసం ఒక టీఎంసీ నీళ్లు లేని కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోని సాగు భూములు నోరెళ్లబెట్టాయి. గతేడాది ఇదే యాసంగి సీజన్‌లో ప్రాజెక్టు ఆయకట్టు 2లక్షల 8410 ఎకరాలకుగాను 22 మండలాల పరిధిలోని 2లక్షల ఎకరాలకు నీరందింది. ఇప్పుడు కనీస నిల్వలు లేక ఆయకట్టు ప్రశ్నార్థకమైంది. ఎస్సారెస్పీ కింద ఉమ్మడి మూడు జిల్లాలైన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌కు తాగు, సాగునీరు అందుతోంది. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండలేదు. 90.58టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో గతేడాది జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు 77.572 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.557టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 


మూడు జిల్లాలకు తాగు నీటి కష్టాలు

అందువల్ల ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారులు సూచించారు. అందుకోసం ఇప్పటి వరకు మూడు విడతల్లో సాగునీరు విడుదల చేశారు. మరో విడత మాత్రమే విడుదల చేసి మిగిలిన నీటిని వేసవి తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. సుమారు 10 టీఎంసీల నీరు తాగునీటికి అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కెనాల్‌ ద్వారా 6 వేల క్యూసెక్కులు, సరస్వతి కెనాల్‌ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్‌ నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మిషన్‌ భగీరథ అవసరాల కోసం ప్రతిరోజూ కోరుట్ల-జగిత్యాలకు 50 క్యూసెక్కులు, నిర్మల్‌-ఆదిలాబాద్‌కు 33క్యూసెక్కులు, నిజామాబాద్‌, కామారెడ్డి ఆర్మూర్‌కు 52 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.జిల్లాకు ప్రధాన నీటి వనరు అయిన నిజాంసాగర్‌ పూర్తిగా ఎండిపోగా.. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో సాగునీటికి కటకటగా ఉంది. ఇక మిషన్‌ భగీరథ కింద కామారెడ్డి జిల్లాకు మంచి నీరు సరఫరా అవుతున్న సింగూరు ప్రాజెక్టులోనూ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వేసవికి తాగునీరూ గగనమే కానుంది. కామారెడ్డి పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం వ్యవసాయ బావులను లీజుకు తీసుకోవాలన్న కలెక్టర్‌ ఆదేశాలు నేపథ్యంలో తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అద్దం పడుతోంది.నిజాంసాగర్‌ నుంచి బెల్లాల్‌ ట్యాంక్‌, అలీసాగర్‌ రిజర్వాయర్‌, రఘునాథచెరువు, మాసాని ట్యాంకులకు మంచినీటి అవసరాలకు 2 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఈ ట్యాంకుల ద్వారా నిజామాబాద్‌ పట్టణానికి, బోధన్‌కు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. మరోవైపు సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 8.35 టీఎంసీల నీటి వాటా ఉంది. సింగూరు నీటిని 'మిషన్‌ భగీరథ'కు వినియోగించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నిజాంసాగర్‌కు నీటి వాటాను నిలిపేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా ప్రజలు దాహార్తితో అల్లాడాల్సిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా పరిధిలో సింగూరు నుంచి 19 మండలాల్లో భగీరథ నీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే, ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ 1.4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇప్పటికే తాగునీటి కోసం వారంలో రెండు రోజులు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఇక వేసవి పరిస్థితి మరింత దుర్భరంగా ఉండనుంది.

No comments:
Write comments