మరో మూడు నెలల పాటు అమల్లో ఈసీ నిబంధనలు

 

సంక్షేమ పథకాలకు బ్రేక్
నల్లగొండ, మార్చి 14, (globelmedianews.com)
ష్ట్రంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పుడప్పుడే అమలయ్యేలా లేవు. వరస ఎన్నికలు, వాటి కోడ్‌ల మూలంగా ఇంకో నాలుగైదు నెలలపాటు వీటి కోసం జనాలు ఎదురు చూడక తప్పదు. ఎన్నికలు, వాటి నోటిఫికేషన్లు, కోడ్‌లు.. ఇవన్నీ సర్కారుకు వరంలా మారబోతున్నాయి. వీటిని సాకుగా చూపి నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, రైతుబంధు కింద ఇచ్చే సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచటం తదితరాంశాల నుంచి ప్రభుత్వం కొద్ది నెలల వరకూ తప్పించుకునే వీలు కలగబోతున్నది. ఇవేగాక ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని పథకాలు, కార్యక్రమాలను కోడ్‌ బూచి చూపి సర్కారు ఆపేయాలని నిర్ణయించింది. 
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వీటిపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాకపోయినా ఏ శాఖకు ఆ శాఖకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఉన్నతాధికారులు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది గొర్రెల పంపిణీ గురించే. ఈ పథకం కోసం సర్కారు ఎన్సీడీసీ నుంచి రూ.4 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నది. ఇందులో దాదాపు 3,800 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. మిగిలిన రూ.200 కోట్లతో మిగతా లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేయటం సాధ్యం కాదు. అందువల్ల ఈ పథకానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని సర్కారు భావించింది. 


మరో మూడు నెలల పాటు అమల్లో  ఈసీ నిబంధనలు

ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తే ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం వాటిల్లుతుంది. అందువల్ల అధికారులకు మౌఖిక ఆదేశాలివ్వటం ద్వారా అనధికారికంగా ఈ పథకానికి బ్రేక్‌ వేయనున్నారు. అయితే అక్కడక్కడా కొన్ని గొర్రెలను పంపిణీ చేయటం ద్వారా పథకాన్ని గొల్ల కుర్మల్లో ఈ పథకాన్ని సజీవంగా ఉంచాలన్నది కేసీఆర్‌ వ్యూహంగా కనబడుతున్నది. ఇదే సమయంలో వివిధ స్కీములు, నిర్మాణాలకు సంబంధించి సర్కారు ఇప్పటికే వేల కోట్ల మేర బకాయి పడింది. వీటికోసం కాంట్రాక్టర్లు, లబ్దిదారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్నటిదాకా మంత్రివర్గం లేదనే కారణంతో ఉన్నతాధికారులు వారికి సర్దిచెబుతూ వచ్చారు. ఇప్పుడు అమాత్యులందరూ బాధ్యతలు స్వీకరించారు. వారు కుర్చీల్లో కూర్చున్న కొద్ది రోజులకే పార్లమెంటు ఎన్నికల నగారా మోగటంతో ఇప్పుడు ఆ పేరుతో మరో నాలుగైదు నెలలపాటు బిల్లులకు మోక్షం లభించే అవకాశం లేదని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు పార్లమెంటు ఎన్నికలు ముగియగానే మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అవి ముగియగానే సహకార సంఘలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పథకాలు, కార్యక్రమాల అమలులో మరింత జాప్యం జరగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రభుత్వ ఖజానాలో తగినంత డబ్బుల్లేకపోవటంతో సంక్షేమ కార్యక్రమాల అమలు సంక్లిష్టంలో పడే ప్రమాదముంది. దాంతో సర్కారుకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి. కానీ వరస ఎన్నికలు కొద్ది నెలలపాటు ప్రభుత్వాన్ని ఈ గండం నుంచి గట్టెక్కించనున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Write comments