గోదావరిలో దొంగలు పడ్డారు

 

రాజమండ్రి, మార్చి 9,(globelmedianews.com)
అఖండ గోదావరి నదిలో ఇసుక దొంగలు పడ్డారు. దొరికినంతా దోచుకుపోతూ ప్రభుత్వ ఖజానా లూటీ చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని కొందరు, ఉత్తర్వులు వచ్చేలోగా మరికొందరు, అనుమతి లేకున్నా రాత్రికి రాత్రే ఇసుకను అక్రమంగా పట్టుకుపోవడం రివాజుగా మారింది. ఆయా ప్రాంతాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్యాకేజీలు మాట్లాడుకుని అనుమతులు ఉన్నాయో లేవో పసిగట్టేలోగా రూ. కోట్ల విలువైన ఇసుకను మాయం చేస్తున్నారు. అఖండ గోదావరి నది ఎడమ గట్టువైపు సీతానగరం మండలం వంగలపూడి వద్ద ప్రభుత్వ పనుల పేరుతో తాజాగా రూ.కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారని తెలుస్తోంది. ఈ ఇసుక ర్యాంపు, పట్ట్భాముల్లో ఇసుక తవ్వకాలను కోర్టు నిలుపుదల చేసింది. రైతుల పట్టా భూముల్లో సైతం అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని, పూర్తిస్థాయిలో విచారణ తరువాతే అనుమతి ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సైతం బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఇసుకను తినేస్తున్నారు. రెండు యూనిట్ల ఇసుక వాహనాల్లో మాత్రమే పట్టుకెళ్లాలనే నిబంధనను అడ్డుపెట్టుకుని, చిన్న చిన్న లారీలు, ట్రాక్టర్లపై ఇసుకను తరలిస్తున్నారు. 


గోదావరిలో దొంగలు పడ్డారు

గోదావరి జిల్లాలో వంగలపూడి, కాటవరం ర్యాంపులకు అనుమతి లేదు. ఇందులో వంగలపూడి ఇసుక ర్యాంపులో ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుకను తరలించవచ్చని అధికారులు ఇచ్చిన ఆదేశాలను అడ్డుపెట్టుకుని పెద్దఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. పగటి పూట చిన్న చిన్న వాహనాల్లోనూ, రాత్రి సమయంలో భారీ టిప్పర్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు. వంగలపూడి గ్రామ పరిధిలో ఇసుక కోసం లేని సర్వే నెంబర్‌ను 205/1ను సృష్టించారంటే అక్రమాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అసలు ఈ సర్వే నెంబర్ లేదని ఇటీవల విచారణాధికారి నిగ్గుతేల్చారు. ప్రస్తుతం వంగలపూడి ర్యాంపు నుంచి వందలాది వాహనాల్లో పగలూ, రాత్రీ తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. పేరుకే ఉచితమైనా రవాణా ఛార్జీల పేరిట లారీ ఇసుక 30నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్నారు.ఇసుక మాఫియా రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ అధికారులను తమ గుప్పెట పెట్టుకుని పెద్దఎత్తున ఇసుక దందా కొనసాగిస్తోంది. ర్యాంపుల నుంచి అక్రమంగా తరలించడంతో పాటు ర్యాంపుల సమీపంలో పెద్ద ఎత్తున ఇసుక కొండలను సృష్టిస్తున్నారు. ఇంకోవైపు వేయింగ్ మిషన్ల సమీపంలో కూడా ఇసుక నిల్వలువేసి, ఆనక గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. వంగలపూడి ఇసుక ర్యాంపులో పెద్ద ఎత్తున కొండ మాదిరిగా ఇసుకను పోగుచేశారు. ఇసుక అప్పటికపుడు మానవ శక్తితో బయటకు తీసి నావలతో ఒడ్డుకు తెచ్చి లోడింగ్ చేసుకోవాల్సి వుంది. పొక్లైన్లను వినియోగించకూడదు. ట్రాక్టర్లు, బండ్లపైనే తరలించాలి. నిల్వ చేయడం చట్టవిరుద్ధం. కానీ భారీ ఎత్తున స్టాక్ పాయింట్లలో నిల్వపెట్టి ఇసుక వ్యాపారాన్ని సాగిస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం అఖండ గోదావరి నది ఎడమగట్టుతో పాటు వివిధ ప్రాంతాల్లో 12 ఇసుక ర్యాంపులు నిర్వహణలో ఉన్నాయి. మరో 12 ర్యాంపులకు అనుమతిచ్చారు. అయితే వంగలపూడి ర్యాంపులో పట్టా భూములతో పాటు వంగలపూడి-2 అనే ర్యాంపుకూడా వుంది. పట్టా భూముల్లో అనుమతిని కోర్టు నిలుపుదల చేసింది. జిల్లా జడ్జి ఇసుక ర్యాంపులను తనిఖీ నిర్వహించి హైకోర్టుకు నివేదిక ఇవ్వడంతో వంగలపూడిలోని పట్టా భూముల్లో ఇసుక ర్యాంపును నిలుపుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీఅయ్యాయి. అయితే ఈ ఆదేశాలు ఇంకా తమ వరకు రాలేదని మైనింగ్ శాఖ చెబుతోంది. బుధవారం ఈ ర్యాంపు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా జరిగిపోయింది.వివిధ కారణాల వల్ల జిల్లాలో ఐదు ఇసుక ర్యాంపులను తాత్కాలికంగా నిలుపుదలచేశారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి, కొత్తపేట మండలం కొత్తపేట-కేదార్లంక 2, కపిళేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలోని పట్టా భూముల్లోని ర్యాంపును, సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని పట్టా భూముల్లోని ర్యాంపును, అదే మండలంలోని వంగలపూడి గ్రామంలోని పట్టా భూముల్లోని ఇసుక ర్యాంపును రద్దుచేశారు. అయితే వంగలపూడి గ్రామంలో పట్టా భూముల్లో ర్యాంపు రద్దయినప్పటికీ, అదే ప్రాంతంలోని ప్రభుత్వ ర్యాంపులో, పట్టా భూముల్లో సైతం ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

No comments:
Write comments