45 డిగ్రీలు దాటిన టెంపరేచర్

 

అదిలాబాద్, ఏప్రిల్ 30, (globelmedianews.com)
ఏప్రిల్‌లో దంచికొడుతున్నయి. అబ్బబ్బ ఏం ఉబ్బరింపు. మే నెలలో తట్టుకునుడెట్టనో ఏమో?' ఎక్కడ చూసినా ఇదే చర్చ. మే తొలి వారం తర్వాత ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటొచ్చు అని అధికారులు ప్రకటించగా...ఏప్రిల్‌ చివరి వారంలోనే 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోతున్నది. మాడ పగిలే ఎండలతో రాష్ట్రం అల్లాడిపోతున్నది. దీనికితోడు ఉబ్బరింపు కూడా తీవ్రమైంది. దీంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో ఫణి తుఫాన్‌ ప్రభావం కనిపిస్తున్నప్పటికీ తెలంగాణపై అదేమీలేదు. వారం పాటు వర్షాలతో రాష్ట్రంలో కొంతమేర చల్లబడ్డ వాతావారణం శనివారం నుంచి మళ్లీ హీటెక్కింది. 68 ఏండ్లల్లో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్‌ చివరి వారంలోనే ఎండలు హడలెత్తిస్తున్నాయి. 1951 నుంచి 2019 వరకు నమోదైన ఉష్ణోగ్రతల సరాసరిని అంచనా వేస్తే ఏప్రిల్‌ చివరివారంలో ఎప్పుడూ ఇంతటి ఉష్ణోగ్రతలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెబుతు న్నారు. ఆదివారం నాడు ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. 


45 డిగ్రీలు దాటిన టెంపరేచర్

వాస్తవానికి  ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మే చివరి వారంలో ఉంటాయి. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వారంలో ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళ న కలిగిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతు న్నారు. వేడిగాలులకు తోడు గాలిలో తేమ శాతం కూడా తగ్గడంతో ఉబ్బరంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజా మాబాద్‌, రామగుండం, ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో గాలిలో తేమ శాతం 25 శాతం లోపే ఆదివారం నమో దైంది. రాజస్థాన్‌ మీదుగా ఉత్తరాది నుంచి పొడిగాలులు, ఫణి తుఫాన్‌ ప్రభావం కారణంగా దక్షిణాది నుంచి వీస్తున్న తేమ గాలులు కలిసే చోట ఈ తరహా భయంకర పరిస్థితి ఉంటుందని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో మేఘాల్లో పీడనం తక్కువగా ఉండటం వల్ల భూమిపై ఉన్న వేడి, తేమను వేగంగా తనలోకి తీసుకుంటుందని, ఫలితంగా గాలిలోని తేమ శాతం వేగంగా తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబు తున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోరెండు మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశమున్నదని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తగ్గుతున్న తేమ..జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..కొన్నిజిల్లాల్లో అయితే సోమవారం గాలిలో తేమ శాతం 25 శాతానికి దిగువనకు పడిపోయింది. ఓవైపు ఎండ, మరోవైపు ఉబ్బరింపుతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొ న్నారు. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు నడుస్తున్నా వశం కాని పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి అయితే చెప్పరానిది. ఈ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు వీలైనంత మేర నీళ్లు ఎక్కువగా తాగాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఐదు లీటర్ల నీటినైనా తాగాల్సిందే. దీనికి తోడు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటివి కూడా ఎండ నుంచి ఉపశమనం కలిగించేవే. అయితే, ఎండలో తిరిగేవారైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ విధిగా తమ వెంట వాటర్‌ బాటిల్‌ ఉంచుకోవాలి. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగేందుకు యత్నించాలి. తమ వెంట ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలి.

No comments:
Write comments