మే 6వ తేదీనుండి బ‌ల్దియా స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌లు

 

45 క్రీడాంశాలు 730 కేంద్రాల్లో ల‌క్ష మందికిపైగా శిక్ష‌ణ 
 ఆన్‌లైన్‌లో ప్ర‌వేశాలకు రిజిస్ట్రేష‌న్
హైదరాబాద్ ఏప్రిల్ 25 (globelmedianews.com)   
 గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం వివిధ క్రీండాంశాల్లో శిక్ష‌ణ‌ను ఇచ్చే స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌లను మే 6వ తేదీ నుండి ప్రారంభిస్తున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ప్ర‌క‌టించారు.   గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో దాదాపు ల‌క్ష‌మందికి వివిధ క్రీడాంశాల్లో శిక్ష‌ణ‌ను ఇచ్చే స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌ల‌ను  గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని 730 కేంద్రాల్లో 45 క్రీడాంశాల్లో నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.   దేశంలోని మ‌రే మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో ఇంత భారీ ఎత్తున వేస‌వి క్రీడా శిక్ష‌ణ శిబిరాల‌ను నిర్వ‌హించ‌డంలేదు. 1968లో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాఠ‌శాల విద్యార్థినీవిద్యార్థులు, యువ‌కులలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించ‌డానికి ఈ స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంపుల‌ను నిరంటంకంగా నిర్వ‌హిస్తోంది. ఆరు క్రీడాంశాలు, ప‌ది ప్లే గ్రౌండ్‌లు, 15మంది కోచ్‌ల‌తో 1400 మంది బాలురు, 200మంది బాలిక‌లతో మొద‌టి వేస‌వి శిక్ష‌ణ శిబిరం జ‌రిగింది. 


 మే 6వ తేదీనుండి బ‌ల్దియా స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌లు

ప్ర‌స్తుత 2019 వేస‌వి శిక్ష‌ణ శిబిరంలో 826 మంది జాతీయ అంత‌ర్జాతీయ‌, సీనియ‌ర్‌ కోచ్‌ల‌తో నిర్వ‌హించే శిక్ష‌ణ శిబిరాల్లో ఆరు సంవ‌త్స‌రాల నుండి 16 సంవ‌త్స‌రాలలోపు బాల‌బాలిక‌ల‌కు ప్ర‌తిరోజు ఉద‌యం 6గంట‌ల నుండి 8గంట‌ల వ‌ర‌కు శిక్ష‌ణ‌ను నిర్వ‌హించ‌నున్నారు. గ‌త 51సంవ‌త్స‌రాల నుండి నేటి వ‌ర‌కు బ‌ల్దియా నిర్వ‌హించిన వేస‌వి శిక్ష‌ణ శిబిరాల ద్వారా 34ల‌క్ష‌ల మందికి పైగా క్రీడాంశాల్లో శిక్ష‌ణ పొందారు. వీరిలో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకున్న‌వారు ఎంద‌రో ఉన్నారు. ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజారుద్దీన్ నుండి బ్యాడ్మింట‌న్‌లో ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి క్రీడాకారిణి పి.వి.సింధు వ‌ర‌కు ఎంతో మంది జీహెచ్ఎంసీ క్రీడా మైదానాల ద్వారా ఎదిగిన‌వారు ఉన్నారు. జీహెచ్ఎంసీలో ప్ర‌స్తుతం 521 క్రీడా మైదానాలు, 7స్విమ్మింగ్ పూల్‌లు, 17 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 11రోల‌ర్స్ స్కేటింగ్ రింగ్‌లు, 5 టెన్నీస్ కోర్టులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలోని ప‌లు ప్లే గ్రౌండ్‌ల‌లో ప్ర‌తినెలా ఒక్కో క్రీడాపై ప్ర‌త్యేక టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తుంటారు. వేస‌వి క్రీడా శిక్ష‌ణ శిబిరాల్లో ఉత్త‌మ ప్ర‌తిభ చూపించిన క్రీడాకారుల‌ను ప్ర‌త్యేకంగా ఎంపిక‌చేసి వారిని ప్ర‌త్యేక టీంగా రూపొందించి స్థానిక‌, రాష్ట్ర‌, జాతీయ స్థాయి పోటీల‌కు పంపించ‌డం జ‌రుగుతుంది. మే 20వ తేదీ నుండి ఎంపిక చేసిన 16 క్రీడాంశాల్లో పోటీలు నిర్వ‌హిస్తారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియమావ‌ళి అమ‌లులో ఉన్నందున ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితో స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌ల‌ను మే 6వ తేదీ నుండి నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. కాగా కొన్ని స్టేడియంల‌లో ఇప్ప‌టికే స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. 
*వేస‌వి శిక్ష‌ణ క్రీడాంశాలు...*
1. సాహ‌స క్రీడ‌లు,  2. అథ్లెటిక్స్‌, 3.ఆర్చ‌రీ, 4. బాల్ బ్యాడ్మింట‌న్‌, 5. బాస్కెట్ బాల్‌, 6. బేస్ బాల్‌, 7. బాక్సింగ్‌, 8. బాడిబిల్డింగ్‌, 9. ష‌టిల్ బ్యాడ్మింట‌న్‌, 10. చెస్‌, 11. క్యార‌మ్స్‌, 12. క్రికెట్‌, 13. సైక్లింగ్‌, 14. ఫుట్ బాల్‌, 15. ఫెన్సింగ్‌, 16. జిమ్నాస్టిక్‌, 17. హ్యాండ్ బాల్‌, 18. హాకీ, 19. జుడో, 20. క‌రాటే, 21. క‌బ‌డ్డీ,  22. ఖో ఖో, 23. కిక్ బాక్సింగ్‌,  24. మ‌ల్కంబ‌, 25. నెట్ బాల్‌, 26. రోల‌ర్ స్కేటింగ్‌, 27. రైఫిల్ షూటింగ్‌, 28. సెప‌క్ త‌క్ర‌, 29. సాఫ్ట్ బాల్‌, 30. టేబుల్ టెన్నీస్‌, 31. త్వైక్వాండో, 32. టెన్నీస్‌, 33. టెన్నీకాయిట్‌, 34. ట‌గ్గాఫ్ వార్‌, 35. త్రో బాల్‌, 36. వాలీబాల్‌, 37. వెయిట్ లిఫ్టింగ్‌, 38. రెస్లింగ్‌ ఇండియా, 39. వెస్లింగ్ రోమ‌న్‌, 40. వుషు, 41, యోగా,  42. క్రాఫ్ బాల్‌, 43. ప‌వ‌ర్ లిఫ్టింగ్‌,  44. బీచ్ వాలీబాల్‌, 45. స్కై మార్ష‌ల్ ఆర్ట్స్‌
*ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్*
జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే సమ్మ‌ర్ కోచింగ్ క్యాంపుల్లో పాల్గొనే స‌భ్యులు ఆన్‌లైన్  http://www.ghmc.gov.in/sports అనే వెబ్‌సైట్ ద్వారా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది.  క్రికెట్‌, టెన్నీస్‌, స్కేటింగ్‌, ష‌టిల్ బ్యాడ్మింట‌న్‌లో శిక్ష‌ణ పొందేవారు ఆధార్‌కార్డు, మొబైల్ నెంబ‌ర్‌తో పాటు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఇత‌ర క్రీండాంశాల‌కు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. 

No comments:
Write comments