అందని సాయం (ఖమ్మం)

 

ఖమ్మం, ఏప్రిల్ 29 (globelmedianews.com): 
ఖమ్మం: పంట పెట్టుబడికి సాయం చేస్తామన్న సర్కారు సమయానికి ఆదుకోలేకపోయింది. పెట్టుబడి పైసలతో సాగు చేద్దామనుకున్న రైతులకు నిరాశనే మిగిల్చింది. రబీ సాగు సీజన్‌ పూర్తయినా పెట్టుబడి అందకపోవడంతో రైతులు కాసుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రైతుబంధు సాయం ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని అనేక మంది రైతులు భావించినా.. ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏ అధికారిని అడిగినా సరైన రీతిలో సమాధానం లభించకపోవడంతో డబ్బులు ఇంకెప్పుడొస్తాయా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి యాసంగి సేద్యం చేసిన రైతులు మాత్రం సాగు నీరందక, ప్రకృతి సహకరించకపోవడం వంటి కారణాలతో నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు. భూమినే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న రైతులను ఆదుకుని.. వారికి పంట పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది.


అందని సాయం (ఖమ్మం)

పథకం కింద ఖరీఫ్‌ సీజన్‌కు రూ.4వేలు, రబీలో రూ.4వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు. అయితే ఖరీఫ్‌లో మొదటిసారిగా ఈ పథకం కింద రైతులు డబ్బులు అందుకున్నారు. ఇక రెండో విడత రబీకి సంబంధించి మరికొంత మంది రైతులకు బ్యాంకుల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 2,65,355 మంది రైతులకు రూ.259కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని అందజేశారు.ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు పథకం ప్రారంభం కాగా.. అప్పుడు రైతులకు చెక్కులను అందజేశారు. ఆ తర్వాత వాటిని రైతులు బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. అయితే రబీ సీజన్‌ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతులకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి చెక్కులు అందజేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల సంఘం చెక్కుల రూపంలో కాకుండా.. నేరుగా బ్యాంకుల్లోనే నగదు జమ చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి అధికారులు రైతులకు బ్యాంకుల్లో నగదు నేరుగా జమ చేస్తున్నారు. అయితే రబీ సీజన్‌ పూర్తయినప్పటికీ ఇంకా కొందరికి బ్యాంకుల్లో నగదు జమ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందరికీ వచ్చినా తమకు ఎందుకు నగదు రాలేదనే ఆలోచనతో వ్యవసాయ, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.రబీ సీజన్‌లో ఇంకా 28,465 మందికి రైతుబంధు నగదు అందాల్సి ఉంది. రైతుబంధుకు సంబంధించి రబీ సీజన్‌లో 2,51,759 మంది రైతులకు రూ.252కోట్లు అందాల్సి ఉంది. వీరందరికీ నగదు అందజేయాలని ప్రభుత్వం లెక్కలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు 2,23,294 మంది రైతులకు రూ.226కోట్లను పంపిణీ చేశారు. రబీ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి దశలవారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతూ వస్తోంది. ఇంకా 28,465 మంది రైతులకు రూ.26కోట్లు అందాల్సి ఉంది. ఈ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రబీ సీజన్‌లో అప్పు తెచ్చుకుని పంటలు సాగు చేసుకున్నామని, పంట అమ్ముకునే సమయం వచ్చినా ఇంకా తమ ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కాలేదని పలువురు రైతులు వాపోతున్నారు. అయితే వ్యవసాయాధికారులు మాత్రం నగదు దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఇంకా రైతులకు ఇవ్వకపోవడానికి కారణమంటూ ఏమీ లేదని, ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొంటున్నారు.  

No comments:
Write comments