లెక్కలు తేల్చేదెలా

 

విజయవాడ, ఏప్రిల్ 24 (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికలు మాత్రమే ముగిశాయి. ఆ తర్వాత ప్రకంపనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు గురించి లెక్కలు చెప్పలేక ఇప్పుడు అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే తపనతో ఒక్కొక్కరు కనీసం రూ.20 కోట్ల నుంచి రూ.40కోట్ల వరకు ఖర్చు చేసినట్టు అంచనా. లోక్‌సభ అభ్యర్థులు అయితే, సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎవరు ఎంత ఖర్చు చేశారనేది చెప్పాల్సింది అభ్యర్థులే కాదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల్లో రూ.28లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. 


లెక్కలు తేల్చేదెలా

ఎంపీ అభ్యర్థి అయితే, రూ.70లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. జనసేన, బీఎస్పీ, కామ్రేడ్లు అయితే, డబ్బుల విషయంలో అంత ఖర్చు చేసే పరిస్థితి లేదు. కానీ, టీడీపీ, వైసీపీ మాత్రం నిధుల వరద పారించాయి. ప్రచారం కోసం, కార్యకర్తలకు భోజనాలు, ఇతర సామగ్రి కోసం కోట్లకు కోట్ల రూపాయలను వెదజల్లాయి. ఓటర్లకు కూడా రూ.1000 నుంచి రూ.2000 ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇవన్నీ లెక్కగడితే ఎన్నికల సంఘం విధించిన పరిమితికి, వాస్తవ ఖర్చులకు పొంతన ఉండదు. దీంతో ఇటీవల కృష్ణా జిల్లాలోని ఓ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి నోటీసులు పంపిందట ఎన్నికల కమిషన్. ఓ ప్రచార కార్యక్రమం కోసం రూ.10లక్షలకు పైగా ఖర్చు చేశారని, అయితే, ఆ లెక్కలను ప్రతి వారం చూపాల్సిన లెక్కల్లో చూపలేదని ప్రశ్నించిందట.ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ నిఘా అధికారులను కూడా నియమించింది. వారు ఏరోజుకు ఆ రోజు అంతా లెక్కగట్టి పై అధికారులకు సమాచారం పంపారు. ఆ నిఘా అధికారులు పంపిన లెక్కలు, ఈ అభ్యర్థులు పంపిన లెక్కలు సరిపోవడం లేదని ఈసీ నోటీసులు పంపుతోందట. కృష్ణా జిల్లాలోనే 20 మంది అభ్యర్థులకు ఇలా ‘లెక్కల’పై నోటీసులు వచ్చినట్టు సమాచారం. అందులో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు చెందిన వారూ ఉన్నారు.ఎన్నికలు ముగిసిన నెల రోజుల లోపు అభ్యర్థులు తమ జమాఖర్చులను ఈసీకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మే 11లోపు ప్రచార ఖర్చుల వివరాలు చెప్పాలంటూ ఈసీ నోటీసులు పంపుతోంది.

No comments:
Write comments