సిటీలో నడక అసాధ్యమేనా

 

హైద్రాబాద్, ఏప్రిల్ 25, (globelmedianews.com)
హైద్రాబాద్ లో పాదచారులు మాత్రం రోడ్డుపై నిశ్చింతగా నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి.రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా, ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినా, పాదచారులకు కష్టాలు తప్పటం లేదు. నగరంలో ఏ ప్రధాన రహదారిని గమనించినా, కిలోమీటరు దూరంలో యూటర్న్, ఎక్కడా కూడా రోడ్డు దాటేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేవు. వాహనాలపై రాకపోకలు సాగించే వారికోసం ప్రత్యేకంగా రోడ్డున్నా, రోడ్డుకిరువైపులా పాదచారులకు ఫుట్‌పాత్‌ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్నా, అది ఎప్పటికపుడు కనుమరుగైపోతోంది. పాదచారులకు అందుబాటులో ఒకవేళ ఫుట్‌పాత్ ఉన్నా, దానిపై దుకాణాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, చెట్లు దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యకు సంబంధించి పాతబస్తీలో మాత్రం దేవుడు దిగి వచ్చినా పరిస్థితులు మారే అవకాశాలు కన్పించటం లేదు. ఫుట్‌పాత్ కబ్జాతో పాటు సగం రోడ్డును వ్యాపార సంస్థలు, తోపుడు బండ్లు కబ్జా చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో కనీసం 108, 104 వంటి అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి. 


సిటీలో నడక అసాధ్యమేనా

అఫ్జల్‌గంజ్ మొదలుకుని, పత్తర్‌గట్టి, మదీనా, చార్మినార్, బహద్దూర్‌పురా, ఖిల్వత్, మొఘల్‌పురా, చత్రినాఖ, తలాబ్‌కట్టా, లాల్‌దర్వాజ, ఇంజన్‌బౌలీ, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ఎక్కడచూసినా పాదచారులు రాకపోకలు సాగించాల్సిన ఫుట్‌పాత్‌లు కబ్జాలపాలై కన్పిస్తున్నాయి. వాహనాల పార్కింగ్ కోసం మహానగర పాలక సంస్థ కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేసి కొందరు వ్యాపారులు షాపులను నిర్మించుకున్నా, కనీసం ప్రశ్నించేందుకు బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ముందుకు రావటం లేదు. స్థానికంగా బాగా పలుకుబడి కల్గిన కొందరు రాజకీయ నేతల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న భయంతోనే పోలీసులు పాతబస్తీలో ఫుత్‌పాత్‌లు, రోడ్లు, పార్కింగ్ స్థలాలు కబ్జా పాలవుతున్నా, చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్‌పై స్థానికుల్లో నెలకొన్న అవగాహన రాహిత్యం, పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఫుట్‌పాత్‌ల కనుమరుగుకు కారణం. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు.. ఫుట్‌పాత్‌ల పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని పాదచారులు కోరుతున్నారు.ఫుట్‌పాత్‌పై నడుస్తున్నపుడు ఏ మాత్రం ఆదమరిచినా, అంతేసంగతులయ్యే పరిస్థితి పొంచి ఉంది. పాదచారుల కోసం ఏర్పాటుచేసిన ఫుట్‌పాత్‌లను కాపాడాల్సిన జీహెచ్‌ఎంసీయే ఫుట్‌పాత్‌పై చెట్లను నాటుతూ, ఆక్రమణలను చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది. విద్యుత్ శాఖ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. మేమేం తక్కువా అన్నట్టు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అంబ్రిల్లాలు ఏర్పాటు చేశారు. ఇక మరికొందరు నేతలు ఫుట్‌పాత్‌లను కబ్జా చేసుకుని దందాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులకు అక్రమ పార్కింగ్ దారితీస్తోంది. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనల ప్రకారం తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లకుగాను సగానికి పైగా అంటే ఐదు వేల కిలోమీటర్ల వరకు ఫుట్‌పాత్‌లను నిర్మించాలనే నిబంధన ఉన్నా, ఏ మాత్రం అమలు చేయటం లేదని సాక్షాత్తు మున్సిపల్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నగరంలో కేవలం 300 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌లున్నాయి. పరిస్థితి ఇప్పటికైనా మారాలి అని మంత్రి పాఠాలు చెప్పినా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కుదరటం లేదు.

No comments:
Write comments