వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం

 

వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్
అమరావతి  ఏప్రిల్ 26 (globelmedianews.com)   
శుక్రవారం వారణాసిలో జరిగిన మోదీ నామినేషన్ ఘట్టం వీడ్కోలు వేడుకలా ఉందని భవిష్యత్తులో ఇలాంటి భారీ ర్యాలీ జరుపుకునే అవకాశం రాదేమోనన్న ఆదుర్ధా మోదీలో కనిపించిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు.  శుక్రవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ లో లంకా దినకర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో మోదీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే కొందరు ఎంపి లు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు బాటలో నడిచే అవకాశం ఉందన్నారు. 70 నుండి 80 మంది ఎంపి లు బిజెపి నుండి బయటికి వచ్చి చంద్రబాబు నాయకత్వంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములు కానున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు ప్రజా సమస్యలపై చేష్టలుడిగి కూర్చున్న నేపధ్యంలో అసెంబ్లీ సమావేశమై సమస్యలు చర్చించాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఫణి తుఫాన్ ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తక్షణం  చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. 


వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం

ఎన్నికల్లో పారదర్శకత కోసం  ఏర్పాటు చేసిన వివి ప్యాట్ లు చంద్రబాబు సాధించిన విజయమని గతంలో తమతోపాటు ఈ అంశంపై కలిసి పనిచేసిన బిజెపి కి నాడు వద్దన్న ఇవిఎం లే నేడు ముద్దయ్యాయని దినకర్ ఎద్దేవా చేశారు. వివి ప్యాట్ లపై జాతీయ స్ధాయిలో చర్చలు లేవనెత్తి ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడ చంద్రబాబు విజయం సాధించారన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో ఎన్నికల సంఘంపై ఢిల్లీలో ధర్నాకు సమాయత్తం అవుతున్నామని ఆయన చెప్పారు. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ఉండేండుకు 50 శాతం వివి ప్యాట్ లో స్లిప్ లు తప్పనిసరిగా లెక్కించాలని కోరుతున్నామన్నారు. వివి ప్యాట్ ల లెక్కింపుకు ఆరు రోజులకే ఇబ్బందిపడే ఈ.సి అధికారులు మొదటి దశలో ఓటింగ్ పూర్తయిన నేపద్యంలో 46 రోజులు ఫలితాల కోసం ఎందుకు ఎదురు చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఎన్నికల నిబంధనలు నిస్పక్షంగా ఉంటే చాలదని వాటిని పర్యవేక్షించే వారు కూడ నిస్పక్షపాతంగా వ్యవహరించినపుడే సమాన అవకాశాలు వస్తాయని తెలియజేశారు. మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు రాజ్యాంగ స్పూర్తిని అడ్డుకుంటూ, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఎందుకు ఇంత పట్టు పడుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. రాజ్యాంగ స్పూర్తికి సి.ఎస్ తూట్లు పొడుస్తున్నారని, ప్రజా సమస్యలపై ఎందుకు తక్షణం చర్యలు తీసుకోవడం లేదో సి.ఎస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలనికోరారు. ప్రక్క రాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రి సి.ఎస్ ను పక్కన కూర్చొబెట్టుకొని సమీక్షలు నిర్వహిస్తున్నారని, తెలంగాణలో లేని ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు అని దినకర్ ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్ మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్ గా మారిపోయిందని, న్యాయ వ్యవస్ధను కూడ నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని పెద్దలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని  ఆరోపించారు. స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్ధలన్నింటినీ మోదీ ఆద్వర్యంలో నిర్వీర్యం చేశారన్నారు. వ్యవస్ధలను కాపాడటంలో కీలకపాత్ర వహించే న్యాయ వ్యవస్ధ పై పట్టుకోసం ప్రయత్నించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని చెప్పారు. దేశంలో మిగతా నాయకులకు వర్తించే ఎన్నికల కోడ్.. ప్రధాన మంత్రికి వర్తంచదా అని అన్నారు.

No comments:
Write comments