ఇంటర్ బోర్డు రద్దుకు దాదాపుగా సిఎం గ్రీన్ సిగ్నల్?!

 

హైదరాబాద్ ఏప్రిల్ 26 (globelmedianews.com), 
తెలంగాణలో గత వారం పది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపద్యం లో ఇంటర్ బోర్డు మనకెందుకు అంటూ గతంలోనే కేసీఆర్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇంటర్ బోర్డును రద్దు చేసేద్దామని - కేంద్రంలోని సీబీఎస్సీ తరహాలో ఒటి నుంచి 12వ తరగతి విద్య వరకు ఓకే సంస్థను ఏర్పాటు చేసుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారు. దానిపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు - ఉపాధ్యాయులు - ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కోరారు. అయితే వారంతా కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో నాడు కేసీఆర్ ప్రతిపాదన అటకెక్కింది. ఇప్పుడు అనుకోకుండా ఇంటర్ బోర్డు వ్యవహారం కారణంగా పెను దుమారం రేగడం - పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం - రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొనడం - సమస్య పరిష్కారం దిశగా ఇంటర్ బోర్డు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం... ఈ అంశాలన్నింటినీ చూపించేసిన కేసీఆర్ ఇంటర్ బోర్డు రద్దుకు నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అంటే... గతంలో తాను ప్రతిపాదించిన మేరకే... ఇప్పుడు కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లుగా ఇంటర్ బోర్డుపై నెలకొన్న వివాదాన్నే అస్త్రంగా చేసుకున్న కేసీఆర్... బోర్డును రద్దు చేయనున్నారన్న మాట.


 ఇంటర్ బోర్డు రద్దుకు దాదాపుగా సిఎం గ్రీన్ సిగ్నల్?!

బోర్డు రద్దుతో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే... కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టవచ్చని - సర్కారీ కళాశాలలను మరింత మెరుగైన రీతిలో నిర్వహించుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రైవేట్ విద్యాలయాల దందాకు తెర పడుతుందన్న వాదన కూడా లేకపోలేదు. మొత్తంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు తీవ్ర దెబ్బ కొట్టే ఈ నిర్ణయాన్ని తనకు తానుగా తీసుకున్నట్లుగా కాకుండా... బోర్డు వివాదాన్ని బూచిగా చూపించేసి పని కానిచ్చేస్తున్నారన్న మాట. ఇంతదాకా బాగానే ఉన్నా...ఇంటర్ బోర్డు రద్దు తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంటర్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారా? లేదంటే... పేరు మార్చి - 1 నుంచి 12 వ తరగతి వరకు మరో సంస్థను ఏర్పాటు చేస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది చేస్తే బాగుంటుందన్న అంశంపై పరిశీలన చేయాలని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఏది చేసినా... అంతిమంగా ఇంటర్ బోర్డుకు కేసీఆర్ మంగళం పాడేయటం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో గత వారం పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు హైటెన్షన్ వాతావరణాన్నే సృష్టించాయి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం - పాసవుతామనుకుంటే... ఇదేంటీ ఇలా ఫెయిలయ్యామన్న ఆవేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం - పొరపాట్లు జరిగిన మాట నిజమేనంటూ ఈ పరీక్షలను నిర్వహించిన ఇంటర్మీడియట్ బోర్డు చెప్పేయడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ఇంటర్ బోర్డు ఎదుట ధర్నాలు - వరుసగా విద్యార్ధుల ఆత్మహత్యలు... అయినా కేసీఆర్ పెద్దగా స్పందించలేదు. చివరకు ఐదు రోజుల తర్వాత తాపీగా అధికారులను ప్రగతి భవన్ కు పిలిపించుకున్న ఆయన ఇంటర్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్మలకు చెక్ పెట్టేలా కీలక ప్రకటన చేసిన కేసీఆర్... రీ కౌంటింగ్ - రీ వాల్యుయేషన్ లను ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పనిలో పనిగా... ఇంతటి ఆందోళనలు - విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ బోర్డు రద్దుకు కూడా ఆయన దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

No comments:
Write comments