సిటీలో గొంతెండుతుంది..

 

హైద్రాబాద్, ఏప్రిల్ 26, (globelmedianews.com)
జవహర్‌నగర్ మున్సిపాలిటీగా మారిన త్రాగునీటి కష్టాలు తీరడం లేదు. ప్రతి ఏట వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటారు . రోజు రోజుకూ ఎండలు అధికం కావడంతో భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది . సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పది రోజుల కొకసారి నీటిని సరఫరా చేస్తున్నారని, ఇవి తమకు ఏమాత్రం చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో పంచాయతీ పాలనలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారని, ఈసారి అటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. దీంతో నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని, ఇది తమకు ఆర్థికంగా భారంగా ఉందని తెలిపారు. క్యాన్ ఒకటి రూ. 20లకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. 


సిటీలో గొంతెండుతుంది..

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. నిబంధనల మేరకు బోరు తవ్వించినా నీరు రావడం లేదని తెలిపారు . నీటి సమస్య ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు .అధికారులు పన్నులు సకాలంలో చెల్లించాలని హుకుం జారీ చేస్తారని , అయితే ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు . దీనికితోడు జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఈ నీటిని తాగడంవల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ముఖ్యంగా రాజీవ్‌గాంధి నగర్, కార్మికనగర్, గబ్బిలాలపేట, శాంతినగర్, మల్కారం, అంబేద్కర్‌నగర్, గిరిప్రసాద్‌నగర్, నందమూరినగర్, సాయినగర్, బిజెఆర్‌నగర్, సుక్కమ్మకుంట, మార్వాడిలైన్, శివాజినగర్, వికలాంగుల కాలని, మోహన్‌రావ్ కాలనీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంద. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.మున్ముందు ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొంత మంది అనధికారికంగా బోరు నీటిని అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా నీటి సరఫరాతోపాటు పాడైన పవర్ బోర్లను మరమ్మతులు చేయించాలని మున్సిపాలిటీ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:
Write comments