నిలువ నీడలేదు.. (నల్గొండ)

 

నల్లగొండ, ఏప్రిల్ 29 (globelmedianews.com) : 
వేసవిలో ఇతర పనులు దొరకని పరిస్థితి. అలాంటి వారు వలస వెళ్లకుండా, కుటుంబ పోషణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్ద సౌకర్యాలు కరు వయ్యాయి.  అసౌకర్యాల నడుమ కూలీలు పనులు చేస్తున్నారు. పనిచేసే చోట కూలీలకోసం టెంట్లు  ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు తాము అన్ని గ్రూప్‌లకు టెంట్లు ఇచ్చామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.  జిల్లాలో మొత్తం 8,76,807 మంది ఉపాధి హామీ కూలీలు నమోదై ఉన్నారు. 3,69,000 జాబ్‌కార్డులు ఉన్నాయి. వేసవిలో ప్రత్యేక పనుల కోసం అధికారులు ఇటీవల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి పొందారు. ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు 77 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. 

నిలువ నీడలేదు.. (నల్గొండ)

ప్రతి కుటుంబానికి 100 రోజులు పని తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. ఇందుకు సుమారు 240 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించారు.  ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉపాధి హామీ పనులను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కూలీలకు 5 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చేసిన పనులకుగాను 9 కోట్ల రూపాయలను కూలీల ఖాతాలో జమచేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.ఎండాకాలంలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకుడుగుంతలు, కందకాలు, చెరువుల పూడిక, చెట్ల తొలగింపు, నర్సరీలు, కాల్వ పూడిక తదితర పనులు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటోంది. కూలీలు ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఎండ తీవ్రంగా ఉండడంతో ఉదయం పూట వెళ్లి పనులు చేస్తున్నారు.  ఉపాధి నిబంధనల ప్రకారం కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. అధికారులు ఎప్పుడో గ్రామాల వారీగా అందించారు. ఎక్కడా అటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. అసలు అవి ఉన్నాయా లేవా అన్నది తెలియని పరిస్థితి.. దీంతో కూలీలు చెట్లకింద సేదదీరుతున్నారు. కూలీలే తట్టలు, మంచి నీరు కూడా తెచ్చుకుంటున్నారు. అందుకు అధికారులు డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. 

No comments:
Write comments