సూర్యాపేటకు రికార్డ్ స్థాయిలో ధాన్యం

 

నల్లగొండ, ఏప్రిల్ 27, (globelmedianews.com)
తెలంగాణలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌యార్డును సోమవారం ధాన్యం ముంచెత్తింది. ప్రస్తుత రబీ సీజన్‌లోనే అత్యధికంగా 66,698 బస్తాల ధాన్యం తరలిరావడంతో మార్కెట్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. వరుసగా రెండురోజుల సెలవుల తర్వాత సోమవారం క్రయవిక్రయాలు జరపగా రైతుల ఒక్కసారిగా ధాన్యం తీసుకువచ్చారు. వాతారణ పరిస్థితుల్లో మార్పులు రావడం, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరం కావడంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతులు ట్రాక్టర్‌లు, డీసీఎంల ద్వారా ధాన్యాన్ని తీసుకొని మార్కెట్‌కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజాముకే యార్డు ప్రాంగణమంతా ధాన్యం రాసులతో కిక్కిరిసిపోయింది. 


సూర్యాపేటకు రికార్డ్ స్థాయిలో ధాన్యం

ఉదయం పదిగంటల వరకు రైతులు ధాన్యంతో తరలిరావడంతో యార్డులోని షెడ్లతో పాటు ఆరుబయట కూడా పూర్తిస్థాయిలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని రాసులుగా పోశారు. దీంతో యార్డులో ఎక్కడా చూసిన ధాన్యం రాసులు, రైతులే దర్శనమిచ్చారు. రికార్డుస్థాయిలో ధాన్యం రావడంతో యార్డులో కాలుతీసి కాలు వేయలేని విధంగా రాసులతో నిండిపోయాయి. గత పక్షం రోజులుగా మార్కెట్‌కు ధాన్యం భారీగా వస్తుండగా ఇదే అదునుగా భావించిన వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోళ్లు జరపుతూ తమను నిలువునా ముంచుతున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. తేమను సాకుగా చూపి అమాంతంగా ధరలు తగ్గించి తమను మోసం చేస్తున్నారని పలువురు రైతులు మండిపడుతున్నారు. ఇంతా జరుగుతున్న అధికారులు మాత్రం వ్యాపారులు, మిల్లర్లకు వంతపాడుతున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అన్ని రకాల ధాన్యానికి క్వింటాకు రూ.1100 నుండి మొదలుకొని అత్యధికంగా రూ.1800ల వరకు కొనుగోళ్లు జరిపిన 80శాతం మేరా ధాన్యాన్ని తక్కువ ధరలకే కొనుగోళ్లు చేసినట్లు రైతులు చెబుతున్నారు. కాగా భారీగా ధాన్యం వచ్చిన దృష్ట్యా మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. వచ్చిన ధాన్యాన్ని కాంటాలువేసి ఎగుమతులు చేసేందుకు గాను సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

No comments:
Write comments