అందాల అరకకు అంతర్జాతీయ గుర్తింపు (విశాఖ)

 

విశాఖపట్నం, ఏప్రిల్ 08 (globelmedianews.com): విశాఖ మన్యం పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చే అరకు కాఫీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపునిచ్చింది. అరకు వ్యాలీ అరబికాతో పాటు కర్ణాటకకు చెందిన కూర్గ్‌ అరబికా, చిక్‌మంగుళూర్‌ అరబికా, బాబా బుడంగిరీస్‌ అరబికా, కేరళకు చెందిన వేయానంద్‌ రోబస్టాకు జీఐ గుర్తింపు లభించింది. మన్యంలో 2015-16 నాటికి 1,58,821 ఎకరాల్లో కాఫీ సాగవుతుండగా.. గత వడేళ్లలో 32 వేల ఎకరాల్లో అదనంగా సాగు పెరిగింది. 2022-23 నాటికి మరో లక్ష ఎకరాలకు కాఫీ సాగును విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇతర పంటల సాగుతో పోలిస్తే.. కాఫీ సాగు లాభదాయకంగా ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు, యువత కాఫీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ, జీసీసీ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కాఫీ సాగును రెండు రకాలుగా వర్గీకరించారు. 


అందాల అరకకు అంతర్జాతీయ గుర్తింపు (విశాఖ)

మొదటి నుంచీ కాఫీ సాగును వాణిజ్య పంటగా సాగు చేస్తున్న కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను సంప్రదాయ ప్రాంతాలుగా గుర్తించారు. సంప్రదాయేతర ప్రాంతం అయినా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే తమిళనాడును అధిగమించింది. రానున్న రోజుల్లో కాఫీ సాగులో రెండో స్థానంలో ఉన్న కేరళను అధిగమించే దిశగా దూసుకెళ్తోంది.దేశ వ్యాప్తంగా కాఫీ సాగుకు సంబంధించి ఆరు పరిశోధనా స్థానాలు ఉండగా వాటిలో ఒకటి గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్‌లో 1970లో ఏర్పాటైంది. ఇక్కడ కాఫీ సాగుపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాణిజ్య పంటగానే కాకుండా అటవీ సంరక్షణ, భూసార పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం, గిరిజనులకు ఉపాధి తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మన్యంలో కాఫీ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశారు. 2023 నాటిని అదనంగా లక్ష ఎకరాల్లో సాగును విస్తరించేందుకు ఉపాధి హామీ నిధుల రూ.349 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా క్షేత్ర స్థాయిలో రైతుల ఎంపిక, మొక్కలు, ప్రోత్సాహకాల పంపిణీ చేపడుతోంది.

No comments:
Write comments