జాట్ లు డ్రీమ్ గాళ్ షాకిస్తారా...

 

లక్నో, ఏప్రిల్ 13  (న్యూస్ పల్స్)
బాలీవుడ్ అందాల భామ, డ్రీమ్ గర్ల్ హేమమాలిని మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ స్థానమైన మధుర నుంచి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హావాతో గత ఎన్నికల్లో గెలిచిన హేమమాలిని ఈసారి విజయం సాధించాలంటే శ్రమించక తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో ఆమె అప్రమత్తమయ్యారు. గత ఎన్నికల్లో హేమమాలిని తన సమీప ప్రత్యర్థి జయంత్ చౌదరిపై గెలుపొందారు. జయంత్ చౌదరి మాజీ ప్రధాని దివంగత చరణ్ సింగ్ మనవడు. ప్రస్తుతం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ కుమారుడు. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆర్ఎల్డీకి బలమైన ‘‘జాట్ ’’ సామాజిక వర్గం విస్తరించి ఉంది. ఈ సామాజిక వర్గం మొదటి నుంచి అజిత్ సింగ్ పార్టీకి మద్దతుగా ఉంటోంది. చెరకు పంటను ఈ ప్రాంతంలో విస్తృతంగా పండిస్తారు. ఈ పంట పండించడం ద్వారా ఈ సామాజిక వర్గం సంపన్న వర్గంగా మారింది. అయినప్పటికీ మోదీ గాలిలో జయంత్ చౌదరి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో హేమమాలినికి 5,74,451 ఓట్లు రాగా, జయంత్ చౌదరికి కేవలం 2,43, 884 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి శ్యామ్ సుందర్ శర్మ తృతీయ స్థానంలో ఉన్నారు. హేమమాలినికి 53 శాతం, జయంత్ చౌదరికి 30 శాతం ఓట్లు వచ్చాయి. 


జాట్ లు డ్రీమ్ గాళ్ షాకిస్తారా...

ప్రస్తుత ఎన్నికల్లో జయంత్ చౌదరి మధురలో పోటీ చేయడం లేదు. ఆయన పక్కనున్న బాగ్ పట్ కు మారారు. తన తాత చరణ్ సింగ్ నియోజకవర్గమది. మధురలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉద్దేశ్యంతో ఆయన బాగ్ పట్ నియోజకవర్గానికి మారారన్న ప్రచారం ఉంది.సామాజిక వర్గ పరంగా చూస్తే 20 శఆతం జాట్ లు నియోజకవర్గంలో విస్తరించి ఉన్నారు. వీరు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించారు. జాట్ తర్వాత ఠాకూర్లు, బ్రాహ్మణులు, ఎస్సీలు, ముస్లింలు, వైశ్యులు అధిక సంఖ్యలో ఉన్నారు. చరణ్ సింగ్ కు పట్టున్నప్పటికీ స్వయంగా ఆయన కుటుంబీకులే ఓడిపోయిన సందర్భాలున్నాయి. 1984 లోక్ సభ ఎన్నికల్లో స్వయంగా చరణ్ సింగ్ భార్య గాయత్రి దేవి పరాజయం పాలయ్యారు. ఇందిర గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో సానుభూతి కారణంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మానవేంద్ర సింగ్ గెలవగా, గాయత్రిదేవి ఓడిపోయారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో స్వయంగా చరణ్ సింగ్ కూతురు జ్ఞానవతి సింగ్ ను కాంగ్రెస్ అభ్యర్థి మానవేంద్ర సింగ్ ఓడించారు. 2009 ఎన్నికల్లో జయంత్ చౌదరి గెలుపొందారు. గత చేదు అనుభవాల నేపథ్యంలో జయంత్ సింగ్ చౌదరి ఈ దఫా బాగ్ పట్ కు మారిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో హేమమాలినిపై కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పాఠక్, ఎస్పీ, బీఎస్పీ సంకీర్ణ అభ్యర్థి కున్వర్ నరేంద్ర సింగ్ లు పోటీ చేస్తున్నారు.యూపీలోని వారణాసి, అయోధ్య తర్వాత మధుర పుణ్య క్షేత్రాల్లో ప్రముఖమైనది. మధురలోని బృందావనానికి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో వస్తుంటారు. జాతీయ సాంస్కృతిక వారసత్వానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ మధురలో మళ్లీ గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. అయితే హేమమాలినిపై నియోజకవర్గంలో వ్యతిరేకత లేకపోలేదు. ఆమె స్థానికురాలు కాదన్న విమర్శ బలంగా ఉంది. ముంబయిలో నివసించే ఆమె అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వస్తారన్న ప్రచారం ఉంది. అయితే హేమమాలిని దానిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను స్థానికురాలిని కాదన్న మాట వాస్తవమేనని, ముంబయిలో నివసించే మాట కూడా వాస్తవమేనని, అయినంత మాత్రాన బయటి వ్యక్తినని విమర్శించడం సరికాదని ధ్వజమెత్తారు. తాను ముంబయిలో ఉంటున్నప్పటికీ నియోజకవర్గాన్ని విస్మరించడం లేదని స్పష్టం చేశారు. తాను గత ఐదేళ్లలో 250 సార్లు నియోజకవర్గాన్ని సందర్శించాననితెలిపారు. ఎక్కడున్నానన్నది ముఖ్యం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించానా? లేదా? అన్నదే ముఖ్యమనిఆమె స్పష్టం చేశారు. ఇటీవల ప్రచారంలో భాగంగా ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పంట పొలాల్లో ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నారు. వరి నూర్పిళ్లలో పాల్గొన్నారు. చెరకు తోటలను సందర్శించారు. బాలివుడ్ నటిని అయినప్పటికీ ప్రజల బాధలు తనకు తెలుసునని, వాటి పరిష్కారానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు. మళ్లీ తన విజయం తధ్యమని హేమమాలిని ధీమా వ్యక్తం చేశారు.ప్రచార వ్యవహారాలను పక్కనపెడితే ఢిల్లీకి సమీపంలో విస్తరించి ఉన్న ఈ మధుర నియోజకవర్గం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈనెల 18న పోలింగ్ జరగనున్న ఈ నియోజకవర్గంలో 17,86,189 మంది ఓటర్లున్నారు. యమునా నది కాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. పారిశ్రామికంగా వెనుకబడింది. వారణాసి, అయోధ్య తర్వాత ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం అయినప్పటికీ దాని అభివృద్ధిపై ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టణానికి పర్యాటక హోదాకల్పించాలని డిమాండ్ స్పందన కొరవడింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ హోదా గల ఢిల్లీలో మధురను కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కొత్త ఎంపీగా ఎవరు ఎన్నికైనా నియోజకవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments:
Write comments