గెలుపుపై జగన్ విశ్వాసం...

 

హైద్రాబాద్, ఏప్రిల్ 13  (globelmedianews.com)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పోలింగ్ అనంతరం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ సరళి వైసీపీకి అనుకూలంగా ఉందని సమాచారం రావడంతో జగన్ ఉత్సాహంతో ఉన్నారు. తన నమ్మకమే తనను నిలబెట్టిందని అన్నారు. పోలింగ్ సరళిపై వైఎస్ జగన్ ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంత శాతం పోలయింది? అక్కడ ఎవరికి అనుకూలంగా పోల్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో పాటు 175 నియోజకవర్గాలపై జగన్ సమీక్ష చేసినట్లు తెలిసింది.వైఎస్ జగన్ తొమ్మిదేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. 16నెలల పాటు జైల్లో ఉండి వచ్చినా ఏమాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. గత ఎన్నికలలో ఓటమి పాలయినప్పటికీ దానిని పాజిటివ్ గానే తీసుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతోనే జగన్ జనం లోకి వెళ్లారు. అయితే అప్పుడున్న పరిస్థితులు జగన్ కు అనుకూలించలేదు. 


గెలుపుపై జగన్ విశ్వాసం...

మోదీ, పవన్,చంద్రాబాబు కలయిక జగన్ పార్టీని దెబ్బతీసింది. అయినా స్వల్ప ఓట్ల తేడాతోనే జగన్ పార్టీ అధికారానికి దూరమయింది.నాలుగున్నరేళ్ల పాటు జగన్ జనంలోనే ఉండటం ఆయనకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రత్యేకహోదా కోసం తొలి నుంచి ఉద్యమించింది తానేనన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అంతేకాకుండా దాదాపు ఏడాదిన్నర పాటు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగిన ప్రజాసంకల్ప పాదయాత్రతో జగన్ జనానికి చేరువ కాగలిగారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో విడుదల చేసిన నవరత్నాలు కూడా తనకు కలసి వస్తాయని జగన్ భావిస్తున్నారు. మ్యానిఫేస్టోను కూడా అన్ని వర్గాల వారికీ అనుకూలంగా మలచడంతో గెలుపుతమదేనన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు.ప్రభుత్వ వ్యతిరేకత తన పాదయాత్ర సమయంలోనే స్పష్టంగా కన్పించిందన్నారు. తనను బీజేపీకి మిత్రుడిగా చూపించి మైనారిటీలను దూరం చేయాలన్న టీడీపీ వ్యూహాన్ని కూడా జగన్ తిప్పికొట్టగలిగారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకోదలచుకుంటే నరేంద్ర మోదీ ప్రభంజనం ఉన్న 2014లోనే పెట్టుకునేవాడినని, కానీ తాను ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తి లేదని జగన్ తన ప్రచారంలో చెప్పగలిగారు. దీంతో పాటు ఈసారి అభ్యర్థుల ఎంపికలో కూడా జగన్ స్పష్టంగా ఉన్నారు. కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టారు. సర్వేలో ప్రజలు అండగా ఉంటారనుకున్న వారి పేరునే ఖరారు చేశారు. అందుకే జగన్ అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు

No comments:
Write comments