ఆకాల వర్షం అపార నష్టం

 

హైద్రాబాద్, ఏప్రిల్ 4, (globelmedianews.com)
రెండ్రోజులుగా ఆయా జిల్లాల్లో కురుస్తున్న వడగండ్ల వాన అన్నదాతలకు అకాల నష్టాన్ని మిగులుస్తోంది. వేసిన పంటలన్నీ నీళ్ల పాలవుతున్నాయి. ఇప్పటికే పొట్ట దశకొచ్చిన వరిపంట వేల ఎకరాల్లో నేలవాలుతోంది.జనగామ జిల్లాలో ఎనిమిది మండలాలు, 31 గ్రామల్లో 1211 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. సుమారు రూ. 65లక్షల 39వేల 400 నష్టం వాటిల్లినట్టు అంచనా. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం, సముద్రాల, తానేదార్‌పల్లి, మీదికొండ, తాటికొండ, ఛాగల్లు గ్రామాలలో 277 మంది రైతులవి 130 ఎకరాలలో వరిపంట, 180 రైతులవి 98 ఎకరాలలో మొక్కజొన్న దెబ్బతిందని అధికారులు అంచనా వేశారు. లింగాలఘనపురం మండలంలోని సిరిపురం, కల్లెం, నాగారం, లింగాల ఘనపురం గ్రామాలలో 80 ఎకరాల్లో సుమారు రూ. 15 లక్షల విలువైన వరిపంట దెబ్బతిన్నట్లు ఇన్‌ చార్జి ఏవో మురళి తెలిపారు. 


ఆకాల వర్షం అపార నష్టం

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంట నీటిపాలైంది. భద్రాద్రి జిల్లాలో పలుచోట్ల మొక్కజొన్న, వరిపైర్లు నేలవాలాయి. కల్లాల్లో ఆరబోసిన మిరప కాయలు తడిసి పోయాయి. గుండాలలో సుమారు 12 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలినట్టు సమాచారం. దుమ్ముగూడెం మండలంలో పొట్టదశకు వచ్చిన వరి పైర్లు నేలవాలాయి. కరకగూడెం మండలంలో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన మిర్చిపంట తడిసి పోయింది. ములకలపల్లి మండలంలో జీడిమామిడి, మామిడి తోటలకు స్వల్ప నష్టం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో వరి, 60 ఎకరాల మామిడితోట నీట మునిగింది. చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. 10 ఎకరాల నిమ్మ తోటలో కాయలు, పూత రాలిపోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట డివిజన్‌లో వందల ఎకరాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. బోరుబావులు, చెరువులు కుంటల కింద వేసుకున్న పంటలు నేలపాలయ్యాయి. మద్దూరు మండల కేంద్రంలోని రైతు కడియాల మోహన్‌ సాగు చేసిన రెండు ఎకరాల వరి పంట పూర్తిగా నేల రాలింది. అధికారిక లెక్కల ప్రకారం ఈడివిజన్‌లో సుమారు వెయ్యి ఎకరాల వరి, 50 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురంలో చిరుజల్లులతో కూడిన వర్షం కురవగా.. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో వడగండ్ల వాన పడింది. రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షం కురిసింది. 

No comments:
Write comments